Congress Nominee Teenmaar Mallanna Wins Grad MLC By Poll
Politics

MLC Electons: తీన్మార్ మల్లన్న ఇకపై ఎమ్మెల్సీ

Congress Nominee Teenmaar Mallanna Wins Grad MLC By Poll: వరంగల్‌- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న) విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, కౌంటింగ్ ముగిసే సమయానికి ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లతో మల్లన్న విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలవగా, మరో స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ ప్రధాన అభ్యర్థులుగా పోటీపడ్డారు. గత నెల 27న పోలింగ్ జరగ్గా.. జూన్ 5న కౌంటింగ్ ప్రారంభమైంది. 34 అసెంబ్లీ స్థానాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. గత నాలుగుసార్లుగా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించిన ఈ స్థానంలో ఈసారి కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి గెలుపుతో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 4,63,839 ఓట్లకు గానూ 3,36,013 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పలు కారణాలతో 25,824 ఓట్లు చెల్లకుండా పోగా, 3,10,189 ఓట్లు చెల్లాయి. దీంతో 1,55,095 వచ్చిన వారు విజేతగా నిలుస్తారని అధికారులు ప్రకటించారు. బుధవారం మొదలైన కౌంటింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగింపు సమయానికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,22,813 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,967 ఓట్లు వచ్చాయి. వీరిలో ఎవరికీ మ్యాజిక్ నంబరు ఓట్లు రాకపోవటంతో అధికారులు రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలో అందరి కంటే మల్లన్నకే ఎక్కువ ఓట్లు రావటంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందించారు. మల్లన్న గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు, ఆయన అనుచరులు నల్గొండలోని లెక్కింపు కేంద్రం బయట బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.

నాలుగో ఎన్నికలో విజయం

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి. ఒకసారి శాసనసభకు కూడా పోటీ చేశారు. తొలిసారి 2015లో పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మల్లన్న పరాజయాన్ని చవిచూశారు. 2019లో హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2021 పట్టభద్రుల ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చినా రెండవ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ అండతో బరిలో దిగి ఎట్టకేలకు విజయం సాధించారు.

సీఎం ట్వీట్

మల్లన్న విజయం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పెషల్ ట్వీట్ చేశారు. ‘నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనమండలికి ఎన్నికైన చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) గారికి శుభాకాంక్షలు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు.’ అని ముఖ్యమంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు