Congress Party: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ‘హైదరాబాద్ నిర్మాణంలో ఎవరి పాత్ర ఎంత’ అనే అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, హరీశ్ రావుల మధ్య కూడా ఇదే అంశంపై డిబేట్ కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క కాంగ్రెస్‌కే దక్కుతుందని ఆ పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ మహానగరానికి పునాది రాయి వేస్తే, కాంగ్రెస్ దీన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపిందని వారు వివరిస్తున్నారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల కష్టం ఎంత ఉంటుందో, హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ తపన, కష్టం అంతే ఉన్నదని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికల చివరి రెండు రోజులు హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్రను వివరించేందుకు టీపీసీసీ ప్రత్యేక ఎజెండాను రూపొందించింది. బీఆర్ఎస్ చేస్తున్న ఫేక్ ప్రచారాలకు ఈ చరిత్రతోనే చెక్ పెట్టి, అర్బన్ ఓటర్లను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Congress Party Govt: రిజర్వేషన్లు గ్రామాల్లో పరిస్థితిపై సర్కార్ ఆరా
కాంగ్రెస్సే బలం
హైదరాబాద్ అనగానే ఇప్పుడు చాలాCongress Partyమంది ‘ఐటీ’ సిటీ అంటారు. కానీ, నిజానికి ఈ నగరానికి బలం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలేనని ఆ పార్టీ వివరిస్తోంది. కాంగ్రెస్ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుల దూరదృష్టితోనే నగరంలో దాదాపు వంద ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బీహెచ్ఈఎల్), భారత్ డైనమిక్స్ (బీడీఎల్), మిధానీ, డీఆర్‌డీవో, సీసీఎంబీ, ఐఐసీటీ వంటి సంస్థలు హైదరాబాద్ గౌరవాన్ని పెంచి, ప్రపంచ పటంలో నిలిపాయి. వీటి ద్వారా లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు పొందారు.
ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేశాం
ఈ సంస్థలకు అనుబంధంగానే ప్రైవేట్ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటై నగర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేశాయని టీపీసీసీ పేర్కొంటోంది. రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన బీహెచ్ఈఎల్ విద్యుత్ రంగానికి వెలుగులు నింపింది. కంచన్‌బాగ్‌లోని బీడీఎల్, మిధానీ, డీఆర్‌డీవో దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచాయి. హబ్సిగూడలోని సీసీఎంబీ, తార్నాకలో ఐఐసీటీ సంస్థలు విజ్ఞాన శాస్త్రానికి కేంద్రం అయ్యాయి. అంతేగాక, హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో నెహ్రూ దార్శనికత
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వివరిస్తున్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల జాతీయ పరిశోధన, శిక్షణా సంస్థను 1960లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ యూసుఫ్ గూడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల చుట్టు పక్కల ఎన్నో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటై లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని కాంగ్రెస్ వివరిస్తుంది. అదే ఏడాది ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యుత్ శిక్షణా సంస్థ ద్వారా, నెహ్రూ దార్శనికతతో ఇంటింటికి విద్యుత్ సరఫరా చేయడానికి ప్రణాళికలు రూపొందాయి. ఈ దార్శనికతనే కొనసాగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.
మెట్రో, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ ఘనత
జూబ్లీహిల్స్ గల్లీల్లోకి మెట్రో తెచ్చింది కాంగ్రెస్సేనని, ఇప్పుడు మెట్రో విస్తరణ ప్రణాళికను కూడా కాంగ్రెస్ ముందుకు తీసుకువెళ్తోందని నేతలు చెబుతున్నారు. అంతేకాక, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), ఇప్పుడు ట్రిపుల్ఆర్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణం కూడా కాంగ్రెస్ పార్టీనే అని టీపీసీసీ పేర్కొంటోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీకి పునరుజ్జీవం వంటివన్నీ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ పార్టీ నేతలు చివరి రెండు రోజుల్లో బలంగా ప్రచారం చేయనున్నారు. మొత్తమ్మీద.. అంతా తామే చేశామని, పదేళ్లలో ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాలకు టీపీసీసీ చెక్ పెడుతూ కాంగ్రెస్ పాత్ర ఏమిటి? అనేది ఆధారాలతో సహా చూపుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది.
Also Read: Congress Party: కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేలు.. సవాల్‌గా మారిన ఇష్యూ
