– ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమణ
– ఉస్మానియా హాస్పిటల్, బాయ్స్ హాస్టల్ నిర్మిస్తాం
– పరిష్కారాల కోసం రూ. 406 కోట్ల నిధులు
– జూడాల డిమాండ్లపై జీవో 244 విడుదల
– విద్య, వైద్యంలో రాజకీయాలు అనవసరం
– మంత్రి దామోదర రాజనర్సింహ
– సీఎం, వైద్యారోగ్య మంత్రి ఫొటోలకు జూడాల పాలాభిషేకం
Damodara Rajanarsimha: జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జూడాలు సమ్మె విరమించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో, తీసుకున్న నిర్ణయాలతో జూడాలు హ్యాపీ అయ్యారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు. చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా సమస్యలను పరిష్కరించి ఉండదని అభిప్రాయపడ్డారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూడాలు వారం రోజులుగా సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం వైపు నుంచి డీఎంకే, ఆరోగ్య శాఖ అధికారులు వారితో చర్చలు జరిపారు. జూడాలు ప్రధానంగా ఎనిమిది డిమాండ్లను ముందు పెట్టారు. ప్రభుత్వం సూత్రప్రాయంగా అందుకు అంగీకరించింది. అయితే, ఉస్మానియా హాస్పిటల్‌లో భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని కొందరు జూడాలు తొలుత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో జూడాలు సమ్మెను తాత్కాలికంగా విరమించడానికి అంగీకరించినా.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగిస్తామని తేల్చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉస్మానియా జూడాలు కూడా సంతృప్తి చెందారు. సమ్మెను సంపూర్ణంగా విరమిస్తున్నట్టు జూడాలు అందరూ వెల్లడించారు.
జూడాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి సత్వర చర్యలకు పూనుకుంది. వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంది. జీవో 244 విడుదల చేసింది. జూడాల సమస్యల పరిష్కారానికి రూ. 406 కోట్లు విడుదలకు జీవో చేసింది. రూ. 204.85 కోట్లతో భవనాలు, రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
విద్య, వైద్యంలో రాజకీయాలు అనవసరం
చర్చల అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మీడియాతో మాట్లాడుతూ విద్య వైద్యం సామాన్యులకు సంబంధించిన విషయమని, ఇందులో రాజకీయాలు అవసరం లేదని తెలిపారు. జూనియర్ డాక్టర్లు కొన్ని సమస్యలను తమ దృష్టికి తెచ్చారని, వాటిని పరిగణనలోకి తీసుకుని పరిశీలించామని వివరించారు. జూడాల సమస్య పరిష్కారానికి రూ. 406 కోట్ల జీవో విడుదల చేశామని వెల్లడించారు. ఉస్మానియా హాస్పిటల్ బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి, ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి కమిట్‌మెంట్‌తో ఉన్నామని స్పష్టం చేశారు. సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవని చెప్పారు. గత ప్రభుత్వాలు చేయని పనిని.. తాము పేదల కోసం ఇప్పుడు చేస్తున్నామని వివరించారు.
పేదలు జంట నగరాలకు రాకుండా సొంత జిల్లాల్లోనే మెరుగైన వైద్యం పొందేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటళ్లను బలోపేతం చేస్తున్నామని వివరించారు. వైద్యం పేదలకు భారంగా మారకుండా ఉండేలా ప్లాన్లు వేస్తున్నామని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.