BC Reservation: బీసీ రిజర్వేషన్లపై త్వరలో అఖిల పక్షం మీటింగ్‌ను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మీటింగ్ తర్వాత నిర్వహించనున్నారు. అన్ని పార్టీలకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానాలను అందజేయనున్నారు. వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలను తీర్మానాల రూపంలో పొందుపరచనున్నారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల(BC Reservation) పై ప్రభుత్వం ముందుకు సాగనున్నది. పీఏసీలో చర్చించిన ఎజెండాను అఖిల పక్షం మీటింగ్‌లో పెట్టనున్నారు. పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి రానున్నారు.
బీసీ రిజర్వేషన్ల(BC Reservation) పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేయాలల్సిన ప్రాసెస్ అంతా సంపూర్ణంగా పూర్తి చేసినా, కేంద్రం మోకాలడ్డు వేసిందని ప్రభుత్వం చెబుతున్నది. దీంతో బీసీ రిజర్వేషన్ల(BC Reservation) ను ఎలా అమలు చేయాలనే దానిపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. కనీసం పార్టీ తరపునైనా అమలు చేయాడానికి ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేందుకు బీసీ సంఘాలు, పొలిటికల్ లీడర్లు, మేధావులు, బీసీ నేతల ఓపీనియన్లను సేకరిస్తున్నది. దీంతో పాటు ఉమ్మడి ఏపీలో అమలైన రిజర్వేషన్లపై కూడా సర్కార్ ఆరా తీస్తున్నది. ఇప్పటికే వాటిపై నిపుణుల కమిటీని అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం.
బీజేపీ కోర్టులో బంతి!
బీసీ రిజర్వేషన్ల(BC Reservation) పై పకడ్బందీగా సర్వే నిర్వహించి అసెంబ్లీలో తీర్మానం, బిల్లు, రిజర్వేషన్ క్యాంప్ తొలగింపునకు ఆర్డినెన్స్ వంటివి తయారు చేసిన ప్రభుత్వం గవర్నర్, రాష్ట్రపతికి పంపించింది. ముందే ఊహించినట్లు వాటికి ఆమోదం లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని విమర్శించేందుకు కీలక అస్త్రం లభించినట్లైంది. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ తన ప్రచారాన్ని మొదలు పెట్టింది. తమ వైపు నుంచి అన్ని క్లీయర్ చేసి కేంద్రానికి పంపించామని, ఇప్పుడు బంతి వాళ్ల కోర్టులో ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అందుకే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్నట్లు అఖిల పక్షం మీటింగ్‌లో అన్ని పార్టీలకు చెప్పాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. అన్ని పార్టీలు ఇందుకు సహకరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పనున్నది.
క్రెడిట్ వస్తుందనే..!
కుల గణన ద్వారా రిజర్వేషన్లను అమలు చేయాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌కు గవర్నర్, రాష్ట్రపతిలు ఝలక్ ఇచ్చారు. బిల్లు, ఆర్డిరెన్స్‌లు పెండింగ్ వెనక బీజేపీ ప్రమోయం ఉన్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. కులాల లెక్కింపు, రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని లీడర్లు విమర్శిస్తున్నారు. తమకు క్రెడిట్ వస్తుందనే తప్పనిసరి పరిస్థితుల్లో జన గణన చేస్తామని కేంద్రం ప్రకటించినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. పైగా 2027లో పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని బీసీ నేతలు మండిపడుతున్నారు. తాము చేసిన బిల్లు, ఆర్డినెన్స్‌లకు క్లియరెన్స్ ఇచ్చి ఫైలట్ మోడ్‌లో తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తే బీజేపీకే క్రెడిట్ వస్తుంది కదా? అంటూ ఓ నాయకుడు చెప్పారు. బీజేపీ సహకరించకపోయినా, రిజర్వేషన్ల అమల్లో కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహాంతో ముందుకు సాగుతుందని వివరిస్తున్నారు. సెప్టెంబరు 30లోపు ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు