– కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్
– తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపాం
– కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదు
– కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై శ్రవణ్ ఫైర్
– సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ
Congress Party: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం చుట్టూ మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే ఆపార్టీ నేత దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించారు. పగ, ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా పాలన చాలా అధ్వాన్నంగా మారిందని మండిపడ్డారు. విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్‌కి సంజాయిషీ నోటీసులా అంటూ ఫైరయ్యారు.
తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు కేసీఆర్‌కి సంజాయిషీ నోటీసులా అంటూ ప్రశ్నించారు. ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర కరెంట్ సరఫరా చేసి, అభివృద్ధికి దారి తీసినందుకే ఈ నోటీసులా అంటూ నిలదీశారు శ్రవణ్. ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్న ఆయన, వారి ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకునే దుష్ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రం, కరెంట్ లోటుతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిని ప్రతీకార రాజకీయాలతో మరింత కష్టతరం చేయడం సరికాదన్నారు.
హామీల అమలు చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీల ప్రతీకార రాజకీయాలకు తెరతీయడం కరెక్ట్ కాదన్న శ్రవణ్, రుణ మాఫీ, రైతు భరోసా, 4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళకు 2500 రూపాయలు లాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సమయంలో రాజకీయ కుయుక్తులను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషిని కేంద్రీకరించాలని సూచించారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను, వారి అభివృద్ధిని అణగదొక్కే ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు దాసోజు శ్రవణ్.
