MAHAYUTI RIFT Rumors: గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పరిపాలనా పగ్గాలు అందుకున్నారు. రెండవసారి సీఎంగా అవకాశం ఇవ్వకుండా, ఉప ముఖ్యమంత్రిగా (Deputy CM) తన స్థాయిని తగ్గించడంతో ఆ నాటి నుంచి శివసేన (షిండే వర్గం) చీఫ్ ఏకనాథ్ షిండే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేల (Eknath Shinde) మధ్య అగాధం ఏర్పడిందని, ఇద్దరికీ పొసగడం లేదంటూ జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ‘‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. 2022లో నన్ను తేలిగ్గా తీసుకోబట్టే నాటి ప్రభుత్వం కుప్పకూలింది’’ అంటూ షిండే శుక్రవారం చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చాయి. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్న ఈ వ్యవహారంపై మహారాష్ట్ర కాంగ్రెస్ (Congress) పార్టీ మరింత ఆసక్తిని పెంచే వ్యాఖ్యలు చేసింది. రానున్న రోజుల్లో అత్యంత కీలకమైన పరిణామం జరగబోతోందని, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ షాక్‌కు గురవుతారని చెబుతోంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య అధికారప్రతినిధి అతుల్ లాంధే (Atul Londhe) శనివారం మాట్లాడారు. ‘‘ఏక్‌నాథ్ షిండే జారీ చేసిన టెండర్లను, విధానాలకు దేవేంద్ర ఫడ్నవీస్ నెమ్మదిగా ముగింపు పలుకుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) రానున్న రోజుల్లో ఏదో కీలక పరిణామం జరగబోతోంది. అది దేవేంద్ర ఫడ్నవీస్‌ను షాక్‌కు గురిచేయవచ్చు’’ అని అన్నారు.
ఇంతకీ ఎక్కడ చెడింది?
గతేడాది మహాయుతి కూటమి మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వచ్చాక, తనను ముఖ్యమంత్రి స్థాయి నుంచి డిప్యూటీ సీఎంగా డిమోట్ చేయడంపై ఏక్‌నాథ్ షిండే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తన కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇదే తరుణంలో తాను తీసుకుంటున్న నిర్ణయాలను సీఎం ఫడ్నవీస్ నిలిపివేస్తుండడంపై షిండే ఆగ్రహాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో షిండే ఆమోదించిన రూ.900 కోట్ల జల్నా ప్రాజెక్టును ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ నిలిపివేసి, దర్యాప్తునకు ఆదేశించడంపై గుర్రుగా ఉన్నారు. దీనికితోడు, ఇటీవల శివసేన (షిండే వర్గం) పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు వై-కేటగిరి భద్రత తొలగించడంతో ఆయన అసంతృప్తి పతాక స్థాయికి చేరిందని తెలుస్తోంది. సీఎం దేవేంద్ర పడ్నవీస్ పాల్గొంటున్న కీలకమైన ప్రభుత్వ సమావేశాలకు కూడా షిండే డుమ్మా కొడుతున్నారు. దీంతో, వీరిద్దరి మధ్య అగాధం ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. కాగా, 2022లో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై ఏక్‌నాథ్ షిండే తిరుగుబావుటా ఎగురువేశారు. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వీరికి ఎన్‌సీపీ అజిత్ పవార్ (Ajith Pawar) వర్గం తోడయ్యారు. ఈ మూడు పార్టీలు కూడా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.