bhatti kishan reddy
Politics

Auction: బొగ్గు గనుల వేలం షురూ.. కేంద్రానికి భట్టి రిక్వెస్ట్

Bhatti Vikramarka: దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా వెస్ట్ ఇన్ హోటల్‌లో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బొగ్గు గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింగరేణి భవిష్యత్, సింగరేణి కార్మికుల ఉద్యోగ భవితపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో ఈ వేలం ప్రక్రియ నిర్వహించారు. ప్రభుత్వ సంస్థ, తెలంగాణకే తలమానికమైన సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించాల్సింది పోయి వేలం వేయడం దారుణమని, ఇదిలాగే కొనసాగితే సింగరేణి సంస్థ భవిష్యత్‌ ప్రశ్నార్థకం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

సింగరేణికి గనులు కేటాయించాలి

ఈ వేలం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బొగ్గు గనులను ఢిల్లీ నుంచి కాకుండా తొలిసారి హైదరాబాద్ నుంచి వేలం వేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అవకాశాలను వినియోగించుకోవడానికి తాను డిప్యూటీ సీఎంగా ఇందులో పాల్గొంటున్నట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే విద్యుత్, బొగ్గు ఉత్పత్తి చాలా ముఖ్యమని, సింగరేణి తెలంగాణకు ఆయువు పట్టువంటిదని, కొంగుబంగారని వివరించారు. సింగరేణికి కొత్త గనుల బ్లాక్‌లను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉన్నదని భట్టి స్పష్టం చేశారు.

సింగరేణి ద్వారా 3 వేల మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసే అవకాశముంటే అందులో సగం ఇప్పటికే వెలికి తీసిందని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. గోదావరి, ప్రాణహిత పరివాహకాన ఉన్నందున సింగరేణి వెలికితీసే హక్కు కోల్పోయిందని, అయితే, చట్టంలోని 17(2) ఏ ప్రకారం కొత్త బ్లాక్ కేటాయించే అవకాశమున్నదని చెప్పారు. సత్తుపల్లిలోని మూడు బ్లాక్‌లు, కోయిగూడెంలోని మూడు బ్లాక్‌లు, శ్రావణపల్లి బ్లాక్‌లు కేటాయిస్తే తక్షణమే బొగ్గు వెలికితీసే సామర్థ్యం సింగరేణికి ఉన్నదని తెలిపారు. కానీ, ఆ బ్లాక్‌లను నేరుగా సింగరేణికి కేటాయించకుండా ప్రైవేటు వేలం నిర్వహించడం బాధాకరమన్నారు. సింగరేణి బతకాలంటే కొత్త బ్లాకులు కేటాయించడం చాలా అవసరమని, గతంలో వేసిన వేలంతో గనులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లిందని వివరించారు. ఇలా వేలం వేసి బొగ్గు గనులను ప్రైవేటురంగానికి కట్టబెట్టడమంటే.. ప్రభుత్వ సంస్థలను కుదేలు చేయడమేనని బాధపడ్డారు. బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వకుంటే అది మూతపడుతుందని హెచ్చరించారు. 39 గనులతో 42 వేల మంది కార్మికులున్న సింగరేణి చివరకు 8 గనులతో 8 వేల కార్మికులు ఉండే పరిస్థితి భవిష్యత్‌లో వస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని సూచించారు.

గత వేలంలో ప్రభుత్వం పాల్గొనే అవకాశమున్నప్పటికీ పాల్గొనకుండా సింగరేణికి నష్టం చేకూర్చందని బీఆర్ఎస్ పాలనపై భట్టి విమర్శలు గుప్పించారు. ఫలితంగా సింగరేణి కోల్ బ్లాకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని వివరించారు. సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని ప్రధాని మోదీని ఒప్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరుతున్నట్టు భట్టి తెలిపారు. సీఎంతోపాటు తాను ఇతర పార్టీలతో కలిసి ప్రధానికి విజ్ఞప్తి చేస్తామని వివరించారు. గత వేలంలో వేసిన సత్తుపల్లి, కోయిగూడ బ్లాక్‌లు కూడా సింగరేణికి కేటాయించాలని, వారి కన్నా 0.5 శాతం అధికంగా చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి కిషణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం

బొగ్గు గనుల వేలం సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్వహిస్తున్నామని, సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్రానిదైతే 49 శాతం వాటా తమకు ఉన్నదని, సింగరేణిపై తమకూ బాధ్యత ఉన్నదని తెలిపారు. సింగరేణిని కాపాడుకునే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని, తెలంగాణ బిడ్డగా తనకూ బాధ్యత ఉన్నదని వివరించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పారు. గత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్లే సింగరేణి ఇవాళ గుదిబండగా మారిందని పేర్కొన్నారు.

67 కోల్ బ్లాక్‌లను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఒడిశా ఓపెన్ యాక్షన్‌లో పాల్గొని గనులు సంపాదించుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ బొగ్గు గనుల వేలం కేవలం ఆదాయం కోసమే కాదని వివరించారు. బొగ్గు గనుల వేలం ద్వారా ఆదాయం రాష్ట్రాలకే వస్తుందని, కేంద్రానికి రాదని స్పష్టం చేశారు. కమర్షియల్ కోల్ మైన్ ఆక్షన్ అంతా పారదర్శకంగా జరుగుతుందని, దేశానికి బంగారం అవసరం లేదని, కానీ, బ్లాక్ గోల్డ్ చాలా ముఖ్యమని తెలిపారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?