– రేపు మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి
– మహనీయుడి సేవలను గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
– రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు
CM Revavnth Reddy About Mahatma Jyotirao Phule Jayanti : పూలే 198వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు.
సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త భావి తరాలకు సైతం మార్గదర్శకులని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు పూలేకు నివాళులు అర్పించారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్.
పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ప్రగతి భవన్‌కు ఆయన పేరు పెట్టి ప్రజా భవన్‌గా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను ఇప్పటికే అమలు చేసిందన్నారు. పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని వివరించారు సీఎం రేవంత్.
మరోవైపు, రంజాన్ నేపథ్యంలో ముస్లిం సోదరులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు.