– గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ సమావేశం
– తెలుగు రాష్ట్రాల సమస్యలపై చర్చ
– ఉమ్మడి ఆస్తులు, అప్పులపైనా ముచ్చట
– కేబినెట్ విస్తరణ, బిల్లులు, ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో రెండు నెలలు పాలనకు దూరంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ వరుసపెట్టి సమీక్షలతో బిజీగా మారారు. ఇరిగేషన్, విద్యుత్, తాగునీటి సరఫరా, విద్య, గ్యారెంటీలతో పాటు హామీలు అమలు, విధివిధానాల రూపకల్పన, వాటికి అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ తదితరాలపై ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగానే రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అలాగే, అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశంపైనా చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపైనా గవర్నర్, సీఎం చర్చించారు.
మధ్యాహ్నం రాధాకృష్ణన్‌తో కలిసి లంచ్ కూడా చేశారు రేవంత్. పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపైనా గవర్నర్‌తో సీఎం చర్చ జరిపారు. ఈనెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపైనా మాట్లాడుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఐదు రోజులపాటు కాంగ్రెస్ పెద్దలతో పాటు, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించారు. ఈ అంశాలపైనా సోమవారం గవర్నర్‌తో చర్చించారు. ఏపీతో ఉన్న ఉమ్మడి సమస్యలు, ఆస్తులు, అప్పులపై మాట్లాడారు. ఈమధ్య ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు రాధాకృష్ణన్. ఈ క్రమంలో, ఆయనతో రేవంత్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.