Delhi Police: ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్‌కు వచ్చి నోటీసులు ఇవ్వడంపై కర్ణాటకలో క్యాంపెయినింగ్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇన్నాళ్లు ఎన్నికల్లో గెలవడానికి సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్‌లో ఉన్నట్టు తనకు సమాచారం వచ్చిందని వివరించారు. సోషల్ మీడియాలో పోస్టు గురించి వారు తెలంగాణకు వచ్చినట్టు చెప్పారు. టీపీసీసీ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి వాళ్లు వచ్చారట అని తెలిపారు. కానీ, ఇక్కడ వారి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని రేవంత్ రెడ్డి అన్నారు. తాము తిరిగి సమాధానం చెబుతామని అన్నారు. ఈ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
Also Read: ఎన్నికల వేళ బీజేపీ డ్రామా.. సీఎంకు నోటీసులు రాలేవు
ఢిల్లీ పోలీసులు తెలంగాణ పీసీసీ నాయకులకు నోటీసులు ఇవ్వడాన్ని ఏఐసీసీ సభ్యుడు, ఎంపీ మాణిక్కం ఠాగూర్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ నాయకులను బెదిరించడానికి, సమన్లు పంపించడానికి ఢిల్లీ పోలీసులను దుర్వినియోగపరచడాన్ని ఖండిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నాయకులను బెదిరించరాదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను నిలిపేయాలని అనుకుంటున్నదని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా తెలంగాణ ప్రజలపై దాడిగానే చూడాలని తెలిపారు.