Telangana: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషించారని వివరించారు. సోనియా గాంధీ, మీరా కుమారి, సుష్మా స్వరాజ్‌లకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. సోనియా గాంధీ ఆనాడు యూపీఏ చైర్ పర్సన్ హోదాలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఉక్కు సంకల్పంతో ఉన్నారని, పార్లమెంటు స్పీకర్‌గా ఉన్న మీరా కుమారి, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మా స్వరాజ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించారని గుర్తు చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పార్టీ రాజకీయంగా కొంత నష్టపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమె ఉక్కు సంకల్పంతో ఉన్నారని వివరించారు. ఇక బాబు జగ్జీవన్ రాము కూతురు మీరా కుమారి అప్పుడు లోక్ సభ స్పీకర్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు. ఒక మహిళగా, కన్న తల్లిగా పిల్లలను కోల్పోతే ఉండే ఆవేదన తెలిసిన అమ్మగా, ఆ రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించారని వివరించారు. తెలంగాణ బిల్లును లోక్ సభలో ఆమోదించుకోవడంలో అత్యంత కీలకమైన బాధ్యతన నిర్వర్తించారని చెప్పారు.
బీజేపీ నాయకురాలైన సుష్మా స్వరాజ్ ఆనాడు లోక్ సభలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించారని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ముగ్గురు మహిళామూర్తులు చేసిన త్యాగాలు, అందించిన సహకారాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరచిపోరని తెలిపారు. ఈ రోజు అవతరణ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డల సాక్షిగా సోనియాగాంధీ, మీరా కుమారి, సుష్మా స్వరాజ్‌లకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ చరిత్ర పుటల్లో ఈ ముగ్గురు మహిళలు తీసుకున్న గొప్ప నిర్ణయాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని వివరించారు.