CM Revanth Reddy: సెప్టెంబరు 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రాసెస్ అంతా స్పీడప్ అయిందన్నారు. ఆయన ఢిల్లీ(Delhi)లో మీడియాతో మాట్లాడుతూ, జై తెలంగాణ అనడం లేదని తనపై ఏడ్చేవాళ్ళు పార్టీలో తెలంగాణ(Telangana) పేరును ఎందుకు తొలగించుకున్నారో చెప్పాలని చురకలంటించారు. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్(BRS) భజన బ్యాచ్ రెడీ అయిందన్నారు. అలాంటి గంజాయి బ్యాచ్‌కు తానెప్పుడు భయపడనని, అలా అయితే తాను రేవంత్ రెడ్డినే కాదని నొక్కి చెప్పారు.
క్లైమాక్స్‌లోనే విలన్ల అరెస్ట్
విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్(KCR) ఫ్యామిలీపై ఎంక్వైయిరీ జరుగుతున్నదని, దర్యాప్తు సంస్థలు త్వరలోనే లెక్కలు తేల్చుతాయని తెలిపారు. ప్రతీ దానికి సమయం, సందర్భం రావాలని, త్వరలోనే అవినీతికి పాల్పడ్డ వ్యక్తులకు చెక్ పడబోతుందని స్పష్టం చేశారు. ఇక గవర్నర్‌కు పంపించిన ఆర్డినెన్స్, రాష్ట్రపతికి పంపిన చట్టం రెండూ వేర్వేరు అని సీఎం వివరించారు. గవర్నర్‌కు పంపించిన ఆర్డినెన్స్ పంచాయితీ రాజ్ చట్టం సవరణకు అని, బీసీ(BC) 42 శాతం బిల్లు రాష్ట్రపతికి పంపించామన్నారు. తమ ప్రభుత్వం ఓ ప్రత్యేక క్లారిటీతో ముందుకు సాగుతుందని తెలిపారు.
రాష్ట్రం కోసం ఎక్కడి వరకైనా వెళ్తా..
గొర్రెల కేసు, ఫార్ములా ఈ – రేస్, జీహెచ్ఎంసీ, కాళేశ్వరం కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను కేంద్రం ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ రాష్ట్ర కేసులో జోక్యం చేసుకున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కలిసి కేటీఆర్ ఫ్యామిలీపై ఉన్న కేసుల విషయాలపై ఎందుకు ఫాలోఅప్ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఎక్కడి వరకైనా కొట్లాడుతానని నొక్కి చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్(BRS) సాధించలేని విజయాలను తాను సాధించినట్లు తెలిపారు. 2018లో బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్‌కు దక్కుతుందన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సీలింగ్ పెట్టారని, కానీ తాము దాన్ని ఎత్తివేసేందుకే ఆర్డినెన్స్ గవర్నర్‌కు పంపించామన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే..
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి 8 సీట్లు బీజేపీ(BJP)కి ఇచ్చిందని సీఎం అన్నారు. ఇక, కాంగ్రెస్(Congress) బీసీని అధ్యక్షుడిని చేస్తే బీజేపీ పంతుల్ని చేసిందని విమర్శించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపీ(UP), మహారాష్ట్రల్లో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తీసి వేసి తెలంగాణలోనూ తీసివేయాలని సూచించాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను పక్కాగా అమలు చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ముసుగు వీరులు ఉన్నారని, వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. పరిపాలన అంటే హైదరాబాదులో ఫాంహౌస్‌లో కూర్చోవడం కాదని చురకలు అంటించారు. తుమ్మిడిహట్టి అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పకుండా కలుస్తానని చెప్పారు.
Also Read: Chandrababu: 10వేల కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి చంద్రబాబు వినతి!
గతంలో కేసీఆర్(KCR) చంద్రబాబు(Chandrababu), జగన్‌తో మాట్లాడినప్పుడు విజయాలుగా చెప్పుకున్నారని, కానీ తాను కలిస్తే తప్పు అంటూ ప్రచారం చేయడం విచిత్రంగా ఉన్నదన్నారు. మీటింగ్‌లకు వెళ్లకపోతే సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుందని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర వాదనను ఎవరు వినిపిస్తారంటూ గుర్తు చేశారు. రాష్ట్ర అవసరాల కోసం ఢిల్లీతోపాటు, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే మహారాష్ట్రకు వెళ్తామని, నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతామి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్‌ను కాపాడేందుకే ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా ఆలస్యం చేశారన్నారు.
కేసీఆర్.. అసెంబ్లీకి రావాలి
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో 299, 400 టీఎంసీలు చాలని సంతకాలు పెట్టిందే హరీశ్ రావు అంటూ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చేయాల్సినంత నష్టం చేసింది కేసీఆర్(KCR) అని నొక్కి చెప్పారు. ఆయన గౌరవానికి భంగం కలుగకుండా చూసుకుంటా అని తాను మాట ఇచ్చానని, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వమంటే ముందుకు రావడం లేదన్నారు. ప్రతిపక్ష నేత ఆ పాత్రను సరిగ్గా చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ తనకు రాజకీయ శత్రువు మాత్రమే అని వివరించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నదని విమర్శించారు. రెండున్నర సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్(KCR Kit) తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖలు రాయడం కాదని, ప్రణాళికతో ముందుకు రావాలని సూచనలు చేశారు. ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కేదార్ ఎలా చనిపోయాడో తెలుసు
ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని కేసీఆర్‌ను ఆయన కుమారుడు కేటీఆర్ అడుగుతున్నారని, అందుకు ఒప్పుకోవడం లేదని సీఎం అన్నారు. సొంత వివాదాలతోనే కేసీఆర్ కుటుంబానికి సరిపోతోందని, కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవట్లేదని తెలిపారు. కేంద్రం పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లాలా, ఫాంహౌసులకు వెళ్తే సమస్యలెలా పరిష్కారమవుతాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఏపీ మంత్రి లోకేశ్‌ను కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారని ప్రశ్నించారు. కేదార్‌తో కలిసి కేటీఆర్ దుబాయిలో డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్స్ కలగలిపి తీసుకోవడం వల్లే కేదార్ మరణించాడని, అతని మరణంపై పూర్తి నివేదిక ఉందని అన్నారు.
మద్యంలో కాక్‌టెయిల్ విన్నామని, డ్రగ్స్‌లో కాక్‌టెయిల్ వినలేదని, డ్రగ్స్ విషయంలో తొలిసారి కాక్‌టెయిల్ అని వింటున్నామని సీఎం తెలిపారు. అవసరమైనప్పుడు కేదార్ మరణ కారణాల రిపోర్టు బయటపెడతామని అన్నారు. ఆ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టడానికీ సిద్ధమేనని, తాను చర్చిస్తానంటోంది ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో మాత్రమేనని, కేటీఆర్‌తో కాదని వెల్లడించారు. హైకోర్టు పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. ఈ కేసు సీబీఐకి ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని అన్నారు.
Also Read: Air India Crash: ఎయిరిండియా క్రాష్‌పై వెలుగులోకి పెనుసంచలనం!