– ఏపీలో కూటమి ప్రభంజనం
– చంద్రబాబుకు తెలంగాణ సీఎం ఫోన్
– టీడీపీ ఘన విజయంపై అభినందనలు
– తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు..
– విభజన చట్టంలోని అంశాలపై చర్చ
– బలరాం నాయక్, వంశీకృష్ణతో రేవంత్ ప్రత్యేక భేటీ
CM Revanth Reddy: ఆంధ్రాలో విజయ దుందుభి మోగించింది ఎన్డీఏ కూటమి. మునుపెన్నడూ చూడని విధంగా భారీ మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు. అయితే, కూటమిలో భాగంగా పోటీ చేసి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది టీడీపీ. పోటీ చేసింది 144 స్థానాలు కాగా, వాటిలో 135 చోట్ల గెలిచింది. అలాగే, 21 చోట్ల పోటీ చేసి అన్నీ గెలుచుకుంది జనసేన. బీజేపీ 10 చోట్ల పోటీ చేసి 8 స్థానాలు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
చంద్రబాబుతో ఏం మాట్లాడారంటే?
ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరారు. అలాగే, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలన్నారు తెలంగాణ సీఎం. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
పార్లమెంట్ ఫలితాలపై రేవంత్ సమీక్ష
గురువారం మహబూబాబాద్ నియోజకవర్గ ఫలితంపై సమీక్ష జరిగింది. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విప్ రాంచంద్ర నాయక్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. పార్టీ గెలుపు అంశాలపై సీఎం వారితో చర్చించారు. ఈ సమావేశం నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.
గెలిచిన ఎంపీలకు అభినందనలు
తెలంగాణలో కాంగ్రెస్ లోక్ సభ స్థానాల సంఖ్య 3 నుంచి 8కి పెరిగింది. ఈ నేపథ్యంలో గెలిచిన ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బలరాం నాయక్‌ను అభినందించారు రేవంత్. అలాగే, పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వంశీ కృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వంశీ కృష్ణను అభినందించారు ముఖ్యమంత్రి.