– శంషాబాద్‌లో హెల్త్ టూరిజం హబ్
– 500 నుంచి 1000 ఎకరాల్లో ఏర్పాటు
– ప్రఖ్యాతిగాంచిన సంస్థలను రప్పిస్తాం
– జబ్బు ఏదైనా నాణ్యమైన చికిత్స అందిస్తాం
– ఇందులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు చోటు
– కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
– చంద్రబాబుపై ఇంట్రస్టింగ్ కామెంట్స్
Basavatarakam Cancer Hospital: తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల వరకు భూమిని సేకరిస్తామని చెప్పారు. ప్రపంచంలో వైద్యరంగంలో ప్రఖ్యాతి గాంచిన, నైపుణ్యవంతమైన సంస్థలను ఇక్కడికి రప్పిస్తామని వివరించారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్నింటికి నాణ్యమైన చికిత్స అందుతుందనేలా ఈ హెల్త్ టూరిజం హబ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ హబ్‌లో తప్పకుండా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చోటు ఉంటుందని స్పష్టం చేశారు.
స్వర్గం నుంచి పెద్దాయన ఆశీర్వదిస్తారు
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పేదలకు ఆరోగ్య సేవలు అందించాలనే ఎన్టీఆర్ ఆలోచనలో నుంచి ఇది ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం ఈ హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలను చూసి ఎన్టీఆర్ స్వర్గం నుంచే మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పారు. 24 ఏళ్లుగా కోట్లాది మందికి ఈ ఆస్పత్రి సేవలు అందించడం సంతోషనీయమని చెప్పారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు ఎలాంటి సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ ఆలోచనలకు రూపమే!
పేదలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆనాడు ఈ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆలోచనా విధానాలను కొనసాగించాలని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా భావించారని, అందుకే హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా నడుచుకున్నారని తెలిపారు.
చంద్రబాబుతో పోటీ
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో అభివృద్ధి, సంక్షేమంలో ఆయనతో పోటీ పడి పని చేసే అవకాశం తనకు వచ్చిందని సీఎం రేవంత్ చెప్పారు. ఇన్నాళ్లూ రోజుకు 12 గంటలు పని చేస్తే సరిపోతుందని తాను అనుకునేవాడినని, కానీ, ఇప్పుడు ఆయన 18 గంటలు పని చేస్తే, తాను కూడా 18 గంటలు పని చేయాల్సే ఉంటుందని తెలిపారు. కాబట్టి ఉద్యోగులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని వివరించారు. ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలన్నారు. రాజకీయం, సంక్షేమం ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చారని, ఆయన మూడో తరం కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. సినిమాలను బాలకృష్ణ చూసుకుంటారని, కాబట్టి, లోకేశ్‌ను, భరత్‌ను రాజకీయంలో రాణించేలా, ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు.