- 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం
- 8న జరిగే మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న బాబు
- అమరావతి పరిధిలోని రాయపూడిలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు
- నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు
- కేంద్రంలో కింగ్ మేకర్ గా అవతరించిన బాబు
- మోదీని కీలక కేంద్ర మంత్రి పదవులు అడిగే ఛాన్స్
- కేంద్రంలో స్పీకర్ పదవిని ఆశిస్తున్న బాబు
Chandra babu oath ceremony on june 12 at Amaravathi circle:
ఏపీకి నాలుగో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 9న కాకుండా 12వ తేదీ 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం (జూన్ 8) రికార్డు స్థాయిలో మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడం వల్ల తేదీలో మార్పు వచ్చింది. అయితే ప్రమాణ స్వీకారం కోసం అమరావతిలోని పలు ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అమరావతి పరిధిలోని రాయపూడిలో ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం 50 లారీల్లో సామాగ్రి సిద్ధం చేశారు.
బాబే కింగ్ మేకర్
ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వరుసగా ఎన్డీయే మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 32 సీట్లు మిత్రపక్షాల సహకారం కావలసి వచ్చింది. దీనితో ఏపీలో 16 ఎంపీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ మద్దతు కీలకం కానుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కింగ్‌మేకర్‌లలో ఒకరిగా చంద్రబాబు నాయుడు నిలిచారు. టీడీపీ అధిష్టానం ఏడెనిమిది కేబినెట్, ఒక మంత్రి బెర్త్‌లపై కన్నేసినట్లు సమాచారం . వీటిలో రోడ్డు రవాణా, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, గృహనిర్మాణం & పట్టణ వ్యవహారాలు, వ్యవసాయం, జల్ శక్తి, ఐటీ, విద్య, ఆర్థిక శాఖలు ఉన్నాయి. ఇక పార్లమెంట్ స్పీకర్ పదవి కూడా మోదీని చంద్రబాబు అడుగుతున్నట్లు సమాచారం.