cabinet expansion to be happen on thursday | Cabinet Expansion: రేపే మంత్రివర్గ విస్తరణ
Cm Revanth Reddy Aim Is To Strengthen Congress party Energy
Political News

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

– కొత్తగా నలుగురికి అవకాశం
– సామాజిక సమీకరణాలే కీలకం
– మంత్రుల శాఖల్లో మార్పులు
– సీతక్కకు హోం ఖాయమంటూ ప్రచారం
– కొత్త పీసీసీ చీఫ్‌ పేరుపైనా క్లారిటీ
– చేరికలపైనా పార్టీ నేతలతో సీఎం చర్చలు

Revanth Reddy Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన చేపట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి నేడు పార్టీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, చేరికలు తదితర అంశాలపై
సీఎం పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. మంత్రి విస్తరణతో బాటు కేబినెట్ ప్రక్షాళనకు పార్టీ అధిష్ఠానం చేత ఆమోదముద్ర వేయించుకునేందుకే సీఎం హస్తినకు రావటంతో నేటి ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

పర్యటన ఎజెండా ఇదే..
తన ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేబినెట్‌ విస్తరణ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుత కేబినెట్ స్వరూపం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవసరమైన మార్పులు తదితర అంశాలను ప్రస్తావించి, ఇప్పటికే మంత్రి పదవుల కోసం పీసీసీ ఖరారు చేసిన 8 మంది సభ్యుల నేపథ్యాలను ముఖ్యమంత్రి పార్టీ పెద్దలకు వివరించనున్నారు. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపైనా తన అభిప్రాయాలను పార్టీ పెద్దలతో చర్చిస్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి సాగుతున్న వలసలు, వాటి పర్యవసానాలనూ నియోజక వర్గాల వారీగా అధిష్ఠానం పెద్దలతో సీఎం పంచుకోనున్నారు.

ప్రస్తుతానికి నలుగురే..
ప్రస్తుత కేబినెట్‌లో ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, అందులో ప్రస్తుతం నాలుగు బెర్త్‌లను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు గనుక ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ జిల్లాలకు అవకాశం రావచ్చని తెలుస్తోంది. అదే జరిగితే నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన రెడ్డికి, ఆదిలాబాద్ నుంచి వివేక్ లేదా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావులలో ఒకరికి బెర్త్ ఖాయమని చెబుతున్నారు. ఇక.. తెలంగాణలో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేనందున మక్తల్ నుంచి ఎన్నికైన వాకిటి శ్రీహరికి అవకాశం దక్కొచ్చని, గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం దీనిపై మాట్లాడారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మునుగోడు, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేల పేర్లు కూడా ఆశావహుల జాబితాలో ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ ప్రక్షాళన
ప్రధానమైన ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో పాలనపై ఫోకస్ చేసి, మంచి ఫలితాలను సాధించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణతో బాటు మంత్రి వర్గ ప్రక్షాళన కూడా చేపట్టనున్నారు. ఈ క్రమంలో మంత్రుల ప్రస్తుత శాఖల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ ప్రక్షాళనలో భాగంగా హోం మంత్రిగా సీతక్కను నియమిస్తారని తెలుస్తోంది. దీనికి పార్టీ అధిష్ఠానం ఆమోదముద్ర కూడా ఉందని, మరో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రుల నేపథ్యం, ఆసక్తి, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ ప్రక్షాళన జరగనుంది.

పీసీసీకి కొత్త బాస్..
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన వేళ.. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఇప్పటికే ఇప్పటికే టీపీసీసీ అభిప్రాయాలను సేకరించిన అధిష్ఠానం మొత్తంగా దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై గతవారమే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలోని పెద్దలకు తమ అభిప్రాయాలను వివరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీసీసీ రేసులో ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, బీసీ కోటాలో మహేశ్‌కుమార్ గౌడ్, ఎస్టీల నుంచి బలరాం నాయక్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాగా.. రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రిత్వం దక్కింది గనుక పీసీసీ పదవిని బీసీలకు ఇవ్వాలనే పాత సంప్రదాయాన్ని ఇప్పుడూ పార్టీ అధిష్ఠానం పాటించనునుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దీంతో కొత్త టీపీసీసీ అధ్యక్షుడి పదవికి మహేశ్‌కుమార్ గౌడ్ పేరు ఫైనల్ అయిందనే ప్రచారం సాగుతోంది.

చేరికలపైనా సమాచారం
ఇప్పటివరకు చేరిన ఎమ్మెల్యేలకు తోడు.. కొత్తగా పార్టీలో చేరాలని ఆసక్తి కనబరుస్తున్న వారి వివరాలనూ ముఖ్యమంత్రి పార్టీ పెద్దలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో బాటు దాదాపు ఏడెనిమిది మంది క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరుగాక మరో 10 మంది శాసన మండలి సభ్యులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరి చేరికల మీద కూడా సీఎం చర్చించనున్నారు.

రేపే ఎందుకంటే..
మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రాజభవన్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసి దీనిపై సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. జులై 2న ఏకాదశి కావటంతో ఆరోజు కేబినెట్ విస్తరణ చేయాలని ముందుగా కొందరు సూచించినా, మంగళవారం కావటంతో దీనిని రేపటికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్రయోదశి, గురువారం కలిసి వచ్చిన కారణంగా రేపు మరింత బాగుందనే అభిప్రాయం కారణంగా జులై 4 న ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Just In

01

Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం