Jagtial: ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత త్వరలోనే బయటకు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాను, ఆమె అంతా కలిసి జగిత్యాలలో గల్లీ గల్లీ తిరుగుతామని, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పారు. పార్టీ మారిన సంజయ్ గడ్డిపోచతో సమానం అని విమర్శించారు. జగిత్యాల బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
గడ్డిపారలు, గట్టి నాయకులు గాలికి కొట్టుకుపోరని, కేవలం గడ్డిపోచలు మాత్రమే కొట్టుకుపోతాయని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా అంతేనని కేటీఆర్ కామెంట్ చేశారు. కవితక్కతో సహా బీఆర్ఎస్ కుటుంబమంతా కష్టపడితే ఇక్కడ సంజయ్ గెలిచారని, కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశపడి కాంగ్రెస్‌లోకి పోయారని తీవ్రంగా విమర్శించారు. జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం మారుతున్నానని సంజయ్ చెబుతున్నాడని, కానీ, సొంత అభివృద్ధి కోసమే పోయారన్నారు. ఆయన వియ్యకుండికి బిల్లులు రావాలని, ఆయన క్రషర్ ఆగొద్దని పోయారని విమర్శించారు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తామని, మెడికల్, నర్సింగ్ కాలేజీ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్‌లోకి వెళ్లాడా? లేక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం జగిత్యాలకు 4,500 డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చినందుకు రద్దు చేయాలని పోయాడా? అని నిలదీశారు.
రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని, సంజయ్ పార్టీ మారి ఆత్మహత్య చేసుకున్నట్టేనని, బండకట్టుకుని బావిలో దూకినట్టేనని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంజయ్ వర్గానికి ఒక్క టికెట్ కూడా జీవన్ రెడ్డి రానివ్వడని పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చి ఏడు నెలలు గడిచినా రుణమాఫీ ఇంకా చేయలేదని విమర్శించారు. కార్యకర్తలు ఎప్పుడు పిలిచినా రావడానికి తాను సిద్ధమని, త్వరలోనే కవితమ్మ కూడా వస్తుందని చెప్పారు. అంతా కలిసి గల్లీ గల్లీ తిరుగుతామని, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.
పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి రాజీనామా చేయించి మళ్లీ పోటీకి నిలబెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. అప్పుడు ప్రజలు పార్టీ మారిన నాయకులకు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.