– బీజేపీకి బీఆర్ఎస్ దాసోహమైంది
– కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ కాంప్రమైజ్
– అందుకే, బీజేపీకి ఎంపీ సీట్లు పెరిగాయి
– కాంగ్రెస్‌కు ఓటెయ్యకుండా కుట్రలు చేశారు
– ఎమ్మెల్యే భూపతి రెడ్డి విమర్శలు
Nizamabad Rural MLA: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ శ్రమించిందని, చివరికి రాజకీయ ఆత్మహత్య కూడా చేసుకుందని ఆరోపించారు. అందుకే, బీఆర్ఎస్‌కు సున్నా సీట్లు వచ్చాయని చెప్పారు. ఇక్కడ పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డిని బలి చేశారని, ధర్మపురి అరవింద్ గెలుపునకు కేసీఆర్ పని చేశారని పేర్కొన్నారు.
త్వరలోనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మూతపడిపోతుందని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం కావడం వల్లే కాంగ్రెస్ ఆశించినన్ని స్థానాల్లో విజయాన్ని నమోదు చేసుకోలేకపోయిందని భూపతి రెడ్డి తెలిపారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడానికే కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యారని, బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేశారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్‌కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయనపై విమర్శలు కురిపించారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఐదేళ్లపాటు చేసిందేమీ లేదని అన్నారు. ఇప్పుడు మరో ఐదేళ్లు కూడా అంతే చేస్తారని ఎద్దేవ చేశారు. మహిళా సంఘాలు, ఓటర్లకు డబ్బులు పంచి, మతాల మధ్య చిచ్చు పెట్టి గెలిచారని తీవ్ర ఆరోపణలు చేశారు.
నయీం డైరీని ఓపెన్ చేస్తామని, బీఆర్ఎస్ అవినీతి చిట్టాను బయటపెడతామని భూపతి రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నిండా మునుగుతుందని, కానీ, సీబీఐతో విచారణకు డిమాండ్ చేస్తున్న బీజేపీ ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని, అందుకే ఓటింగ్ శాతం కూడా పెరిగిందని తెలిపారు. త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు.