Farmers: రైతుల ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహించారు. కొన్ని చోట్ల తడిసిన ధాన్యం మొలకెత్తుతున్నదనీ అన్నారు. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేశారు. క్వింటాల్ వరి ధాన్యానికి రూ. 500 బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచించడమేనని, దగా చేయడమేనని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని, ఇప్పుడు మాట ఎలా మారుస్తారని మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులు రైతులకు అండగా నిలబడాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని పిలుపు ఇచ్చారు.
Also Read: ధర్నాలు చేసేది రైతులు కాదు.. బీఆర్ఎస్ నాయకులే
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలకు దిగారు. కరీంనగర్, సిరిసల్ల, మహబూబ్‌నగర్, కామారెడ్డి, భువనగిరి, మెదక్, దుబ్బాక, మిర్యాలగూడ సహా పలుచోట్ల స్థానిక బీఆర్ఎస్ నాయకుల ఆధ్వరంలో ఈ ధర్నాలు జరిగాయి. కొన్ని చోట్ల వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి బైఠాయించారు.
ప్రభుత్వ విధానాలతో రైతులు కన్నెర్ర చేశారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని, రూ. 500 బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తున్నదని దుబ్బాకలో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.