BRS Party: బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనుకబడిందని, సమస్యలను గాలికొదిలి కేవలం (Telangana Bhavan ప్రెస్ మీట్‌లకే పరిమితమయ్యిందనే చర్చ జరుగుతున్నది. (Hyderabad) హైదరాబాద్‌లో ఉంటే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందా, ప్రజల సమస్యలు నాయకులకు పట్టావా, కేవలం మీడియాలో మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయా అనేది ఇప్పుడు క్యాడర్‌లో హాట్ టాపిక్ అయింది. నాయకత్వం కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ (BRS) నేతల తీరు సరిగ్గా లేదని తెగ చర్చించుకుంటున్నారు.
సోషల్ మీడియాకే పరిమితమా?
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నది. అయితే ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనుకబడుతుందనే చర్చ జరుగుతున్నది. నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన నాయకులు కేవలం హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలపై తెలంగాణ భవన్ (Telangana Bhavan) వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తున్నారు తప్ప, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మర్చిపోయారని బీఆర్ఎస్ పార్టీలోనే జోరుగా చర్చ జరుగుతున్నది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్ మాటల యుద్ధానికి తెరలేపింది. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ పదే పదే విమర్శనాస్త్రాలు సందిస్తున్నది. కానీ, దీనిపై ఆశించిన మేరకు తిప్పికొట్టడంలో గులాబీ నేతలు విఫలమవుతున్నారని అనుకుంటున్నారు. కేవలం సోషల్ మీడియా వేదికగానే కౌంటర్లు చేస్తున్నారని పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు.
Also Read: Telangana Government: సర్కార్ కీలక నిర్ణయం పరిపాలనలో మరింత పారదర్శకత!
కాళేశ్వరం విషయంలో విఫలం
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మించి ఈ నెల 21వ తేదీకి 6 ఏళ్లు అయింది. ఆ ప్రాజెక్ట్ ఘనతను ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ (BRS) ప్రకటించింది. గ్రామగ్రామన అవగాహన కార్యక్రమం చేపడతామని కేటీఆర్, హరీశ్ రావు సైతం పేర్కొన్నారు. కానీ అడుగు ముందుకు పడలేదు. ప్రాజెక్ట్ ఘనతను చెప్పలేకపోయారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. చెప్పిన మాటలకే నేతలు కట్టుబడి ఉండలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ ఎందుకు వెనుకంజ వేసిందనేది సైతం నేతలు చర్చించుకుంటున్నారు. ప్రాజెక్ట్ వ్యయం 94 వేల కోట్లు అయితే కాంగ్రెస్ మాత్రం లక్ష కోట్ల అవినీతి జరిగిందని అంటున్నది.
అవినీతి ఎక్కడ జరిగిందని కేవలం ఆరోపణలే అంటూ మీడియా వేదికలపై మాత్రమే గులాబీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కాళేశ్వరంపై కాంగ్రెైస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ప్రాజెక్టుల సందర్శన, రైతుల పంటలకు అందుతున్న నీటి సౌలభ్యం, ప్రాజెక్టుతో ఉపయోగాలు, భూగర్భ జలాలు పెరుగుదల, ప్రజలకు అర్థం అయ్యే విధంగా వివరించాల్సి ఉంటుంది. కానీ అందివచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్ నేతలు చేజార్చుకుంటున్నారని, కేవలం హైదరాబాద్‌లో ఉంటూ ప్రెస్ మీట్‌లకే పరిమితం అవుతున్నారని పార్టీ నేతలే పలువురు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో పంట పంటకి రైతులకు రైతు బంధు ఇచ్చామని చెబుతున్నా, కాంగ్రెస్ మాత్రం రైతులను మోసం చేశారంటూ ఆరోపణలు చేస్తున్నది. ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో గులాబీ పార్టీ నేతలు విఫలమవుతున్నారనే ప్రచారం ఊపందుకున్నది.
నిరుత్సాహంలో క్యాడర్
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఓటమికి ప్రాధాన కారణం ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు నేతలు అందుబాటులో ఉండకపోవడమేనని, గ్రామాలకు వచ్చినా ప్రజలు విన్నవించిన సమస్యలను పెడచెవిన పెట్టడంతో తీవ్ర వ్యతిరేక వచ్చిందని పార్టీ సైతం గుర్తించింది. అమలు చేసిన సంక్షేమ పథకాలను సైతం వివరించడంలో వెనుకబడ్డామని అందుకే ప్రతికూల ఫలితాలు వచ్చాయని పేర్కొంది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఈ సమయం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన తరుణం. ప్రభుత్వం విస్మరించిన ప్రతి అంశాన్ని గుర్తు చేసేందుకు ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేయాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా నేతలు వ్యహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా అధికారంలో ఉన్నామనే భావనతో ఉండడం, ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌కు నేతలు అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
దూరంగా ఎందుకు?
కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర స్థాయి కార్యాచరణ చేపట్టడంలో అధిష్టానం విఫలమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. హామీలు, గ్యారెంటీల్లోని అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు పూర్తిస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టకపోవడం, ప్రజా సమస్యలపైనా పోరాటానికి శ్రీకారం చుట్టకపోవడం, కేవలం మీడియా వేదికగానే విమర్శలు చేస్తుండడంతో క్యాడర్ నిరాశకు గురవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో నిత్యం ప్రజల్లో ఉంటుండడంతో వారు యాక్టీవ్ అవుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం వెనుకబడుపోతుందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
అధిష్టానం ప్లాన్ అదేనా?
రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ నేతలంతా ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందే. అంతేకాదు గ్రామ కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర కమిటీల వరకు అన్ని కమిటీలు కంప్లీట్ చేసి నేతలకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతికూల పరిస్థితి తప్పదని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఇప్పటికైనా గులాబీ పార్టీ నాయకత్వం ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణతో పాటు కమిటీలపై దృష్టిసారిస్తే కలిసి వస్తుందని మెజారిటీ స్థానాలను చేజిక్కించుకుంటామని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, అధిష్టానం ఈ విషయంలో వ్యూహంతోనే ముందుకు వెళ్తుందనే టాక్ కూడా ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో ఎంత కష్టపడి గెలిచినా పార్టీలో కొనసాగుతారో లేదో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఆర్థికంగా నష్టపోయి అభ్యర్థులను గెలిపించి అధికార పార్టీకి ఉపయోగపడేలా చేయడం ఎందుకనే ఆలోచనలో అధిష్టానం ఉన్నదని కూడా చర్చ జరుగుతున్నది.
Also Read: MHSRB Releases Notifications: స్పీచ్ ఫాథాలజిస్ట్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ!