kcr back step
Politics, Top Stories

Hyderabad:మూగబోయిన ‘గులాబీ గళం’

  • పదేళ్లుగా ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు గుర్తింపు
  • ప్రస్తుతం దయనీయ స్థితిలో గులాబీ శ్రేణులు
  • రాష్ట్ర స్థాయి ఉద్యమాలకు దూరంగా ఉంటున్న అగ్రనేతలు
  • ‘నీట్’ పరీక్ష అక్రమాలపై పోరాటాలకు పిలుపునివ్వని బీఆర్ఎస్
  • బొగ్గు గనుల వేలం సైతం అడ్డుకోలేక పోయిన నేతలు
  • పెద్దపల్లి ఘటనపై పెదవి విప్పని కేసీఆర్
  • నాడు ఉద్యమాలకు ముందు…నేడు బహుదూరం
  • ట్విట్టర్ లో కేసీఆర్ తీరుపై నెటిజన్ల ట్వీట్స్

BRS not participated and back step for any mass movements in telangana:
ఒకప్పుడు ఉద్యమం అనగానే బీఆర్ఎస్ నేత గుర్తుకొచ్చేలా ఉండేది. తెలంగాణలో ఏ ఉద్యమానికైనా బలమైన నేతగా కేసీఆర్ కు ఉన్న పేరు మరెవ్వరికీ లేదు. మడమ తిప్పని పోరాట యోధుడిగా, తెలంగాణ జాతిపితగా బిరుదులు తెచ్చుకున్న నేత కేసీఆర్ పరిస్థితి నేడు ఉద్యమాలకు దూరం ఊరికి భారం అన్న చందాన ఉందని రాజకీయ విమర్శకులు, నెటిజెన్లు ఆడేసుకుంటున్నారు. మహా ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ పదేళ్లూ చెప్పుకుంటూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు జనం ముందుకు రావడానికే భయపడిపోతున్నారని విమర్శకులు అంటున్నారు. తనకున్న వాగ్ధాటితో గత పదేళ్లుగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నే మనుగడ లేకుండా చేశారు. దాదాపు కొనఊపిరి స్థాయి నుంచి కొండను పిండిచేసే స్థాయి దాకా కాంగ్రెస్ పార్టీ గోడకు కొట్టిన బంతిలా బలంగా లేచింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మార్చే స్థాయిలో గులాబీ శ్రేణుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఎంతలా అంటే కేసీఆర్ కనీసం ప్రజాక్షేత్రంలో కనిపించనంతగా…

అజ్ణాతంలోకి అగ్ర నేత

పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కేసీఆర్ కనీస స్థాయిలో ప్రజా సమస్యలపై స్పందించడం లేదని సొంత పార్టీ నేతలే పనిగట్టుకుని కేసీఆర్ ను విభేదిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజాసమస్యలపై గళమెత్తుతోంది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షా పత్రం లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో సైతం ఎన్ఎస్ యూఐ, ఎస్ఎప్ఐ, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు రొడ్డెక్కాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటిని సైతం ముట్టడించాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సైతం ముట్టడించేందుకు యత్నించాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం విద్యార్థుల పక్షాన నిలబడటంలో విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడితప్ప చెప్పుకోదగిన కార్యక్రమాలను చేపట్టలేకపోయింది.ప్రతి జిల్లాకూ మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని, వైద్యానికి పెద్దపీట వేశామని, తెలంగాణ విద్యార్థులకు మెడికల్ విద్యను అందుబాటులోకి తెచ్చామని గులాబీ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ విషయంలో వారి పక్షాన పోరాటం చేయడంలో విఫలమైందని పార్టీ కేడర్‌లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బొగ్గు గనుల వేలంపై గొడవేది?

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ బొగ్గు గనుల వేలం విషయంలోనూ ప్రెస్‌మీట్‌లకే పరిమితమైంది. ప్రస్తుతం శ్రవణ్‌పల్లి బ్లాక్ వేలం పాట కొనసాగుతునప్పటికీ దానిని అడ్డుకోవడంలో వెనకడుగు వేసినట్టు విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, ఆర్‌కే 6 బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 9 రోజుల పాటు నిరసనలు, సమ్మె చేపట్టింది. గతేడాది ఏప్రిల్ 8న సైతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టింది. కోల్ బెల్టులో మహాధర్నా కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. ఇందులో నేతలంతా పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పార్టీ అనుబంధ కార్మికసంఘం ఘోరంగా పరాజయం పాలైంది. కార్మికసంఘం నేతలు సైతం ఇతర సంఘాల్లోకి వెళ్లారు. దీంతో పార్టీ అనుబంధ సంఘం వీక్‌గా మారింది. ఆ కారణంగానే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు దిగకుండా మీడియా వేదికగా విమర్శలకు మాత్రమే పరిమితమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌తోనే సింగరేణి రక్షణ అంటూ గతంలో పార్టీ నేతలు చేసిన కామెంట్స్‌ను పలువురు గుర్తుచేస్తున్నారు.

పెద్దపల్లి ఘటనపైనా మౌనమే..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష కార్యచరణ చేపట్టకపోవడం విమర్శలకు దారితీసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఉద్యమకార్యచరణ చేపట్టకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. అసలు గులాబీ పార్టీ తెలంగాణలో ఉన్నదా..? లేదా..? అనే అనుమానం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. పదే పదే 60 లక్షల సభ్యత్వం ఉన్నదని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా.. ప్రజాసమస్యలపై ఎందుకు పోరాడటం చేయడం లేదని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?