సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివాకానంద్ లేఖ
BRS mla kp vivekanand wrote letter to CM Reventh on the issue of opium
తెలంగాణ యువత మునుపెన్నడూ లేని విధంగా నేడు గంజాయి మత్తులో మునిగితేలుతూ వారి బంగారు భవిష్యత్‌ను అంధకారంలోని నెట్టేసుకుంటున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ కట్టడికి కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. కానీ గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో విచ్చలవిడిగా గంజాయిని విక్రయిస్తున్నారు. దీంతో యువత గంజాయి సేవిస్తూ ఇతరులపై దాడులకు వెనుకాడటం లేదు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు బతుకుదెరువు కోసం వచ్చి భార్యాపిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు గంజాయి సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఇంజినీరింగ్, ఫార్మా, మెడికల్, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఉండడంతో.. వాటిని లక్ష్యంగా చేసుకుని గంజాయిని విక్రయిస్తున్నారు. ఇక విద్యార్థులకు వేల రూపాయాలు ఖర్చు పెట్టి గంజాయి కొనుగోలు చేసి, దానికి బానిసలవుతున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి డ్రగ్స్ సరఫరా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తయారు చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తెలిపారు.
మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రత్యేక విభాగాలు
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం కేసీఆర్ మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం పాన్ షాపులలో, కిరాణ షాపులలో విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతోందని పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులే లక్ష్యంగా సమీపంలో గుడిసెల్లో గంజాయిని విక్రయిస్తున్నారని లేఖలో తెలిపారు. దీంతో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాల్సిన విద్యార్థులు పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్ద నిద్ర వీడి డ్రగ్స్ సప్లై, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.