Gudem Mahipal Reddy: ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను కోల్పోయిన బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా? పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీజేపీలోకి చేరబోతున్నారు? ఆయన ఢిల్లీ పర్యటన ఇందుకోసమేనా? ఇటీవల ఈడీ దాడుల తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి.. బీజేపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారా? ఈడీ దాడి తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం.. మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు బీబీ పాటిల్‌తో భేటీ కావడం, ఆయన వెంట ఓ బీజేపీ నాయకుడు కూడా ఢిల్లీకి పయనం కావడం, గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ తన ఫామ్‌హౌజ్ మీటింగ్‌కు డుమ్మా కొట్టడం వంటి అంశాలు పై అనుమానాలను బలపరుస్తున్నాయి. అన్ని కుదిరితే.. త్వరలోనే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్‌కు బైబై చెప్పేస్తారని, కాషాయ దళంలోకి చేరుతారని అభిప్రాయాలు రాజకీయవర్గాల నుంచి వినిపిస్తున్నది.
గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ పై పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు సుదర్శన్ రెడ్డి లకుడారంలో క్వారీలు, మైనింగ్‌లు చేపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు వీరిపై ఫోకస్ పెట్టారు. పోలీసులు, జియాలజీ శాఖ వారికి నోటీసులు పంపి అక్రమ మైనింగ్ చేసినందున రూ. 340 కోట్ల జరిమానా చెల్లించాలని పేర్కొంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఈడీ తనిఖీలు నిర్వహించింది. సుమారు రూ. 300 కోట్ల విలువైన అక్రమ మైనింగ్ జరిగిందని ఈడీ ఓ అంచనాకు వచ్చింది. మహిపాల్ రెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను సీల్ చేసింది. దీంతో ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇందులో భాగంగానే ఆయన సంగారెడ్డి బీజేపీకి చెందిన ఓ నేతతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్పారు. బీఆర్ఎస్ టికెట్ పై రెండు సార్లు జహీరాబాద్ ఎంపీగా గెలిచి బీజేపీలోకి వచ్చిన బీబీ పాటిల్‌తో సమావేశం అయ్యారు. బీబీ పాటిల్ ద్వారా బీజేపీ పెద్దలను ఒప్పించి బీజేపీలోకి చేరాలని మహిపాల్ రెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. తొలుత ఆయన ఢిల్లీ పర్యటన గురించి ఆరా తీయగా.. సన్నిహిత వర్గాలు కేసుల పని మీద ఢిల్లీకి వెళ్లాడని, న్యాయవాదులతో మాట్లాడటానికే వెళ్లాడని చెప్పారు. కానీ, బీజేపీ నాయకులతో భేటీ తర్వాత వారి నుంచి సమాధానాలు రావడం లేదు. దీంతో ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని, బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి.. గ్రీన్ సిగ్నల్ వచ్చాక ప్రకటన వచ్చే అవకాశమూ ఉన్నదని రాజకీయవర్గాలు వివరిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకే అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్.. ఎమ్మెల్యేలను తన ఫామ్‌హౌజ్‌కు రప్పించి మరీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో నిర్వహించిన సమావేశానికి గూడెం మహిపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఈ పరిణామంపై వివరణ అడగ్గా.. తనకు సమాచారం లేదని ఢిల్లీలో సమాధానం ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుచరులు చెబుతున్నారు.