BRS: బీఆర్ఎస్ పార్టీకి 2023 నుంచి ఏదీ కలిసి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వస్తామని ఆశించింది. ఊహించని ఫలితాలను ప్రజలు కట్టబెట్టారు. దాంతో 39 ఎమ్మెల్యే స్థానాలతోనే సరిపుచ్చుకున్నది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడూ రాని విధంగా ఫలితాలు వచ్చాయి. ఏకంగా లోక్ సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. 14 పార్లమెంట్ స్థానాల్లో మూడో స్థానానికి పరిమితం కాగా, ఖమ్మం, మహబూబాబాద్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది.
Also Read: BRS: సైలెంట్ ఓటింగ్‌పై గులాబీ ఆశలు.. కచ్చితంగా గెలుస్తామని ధీమా!
వరుస ఓటములు
పార్లమెంట్ పోరు తర్వాత రాష్ట్రంలో కరీంనగర్ టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కనీసం గట్టిపోటీ సైతం ఇవ్వలేదు. అలాగే, రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాలతోపాటు పార్టీ నేతల్లోనూ సందేహం నెలకొన్నది. త్వరలో రాష్ట్రంలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటనేది చర్చకు దారి తీసింది. దీనికి తోడు మున్సిపల్, కార్పొరేషన్లలో కనీసం పట్టు నిలుపుకుంటుందా లేదా? అసలు పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
ఇప్పటికైనా మేలుకుంటుందా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోవడమే కారణమా? పార్టీ వరుస ఓటమి పొందుతున్నా సమీక్ష చేయకపోవడమా అనేది ఇప్పుడు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అసలు పార్టీపై దృష్టి పెట్టకుండా అధిష్టానం నిత్యం ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే లాభమేంటని పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల వారీగా సమీక్షించిన పార్టీ ఆ తర్వాత వదిలేసిందని, కనీసం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించకపోవడం, సెకండ్ స్థాయి నేతల అభిప్రాయాలు తీసుకోకపోవడం, కేడర్ ఫీడ్ బ్యాక్ సైతం తెలుసుకోకపోవడం, కనీసం సమస్యలు చెప్పుకుందామంటే కలవకపోవడమే వరుస ఓటములకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పార్టీ ప్రక్షాళన చేయాలంటే లేదంటే స్థానిక ఎన్నికల్లోనూ కష్టమేననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: BRS Party: గులాబీ ఏజెంట్లతో రహస్య భేటీలు.. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు!
