రెండు ఎమ్మెల్సీల విజయంతో బీజేపీలో ఉత్సాహం
ఇప్పటికే ఉత్తరాదిన 4 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలు
బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీకి షిప్ట్ అయిందా?
సిట్టింగ్ స్థానం కోల్పోవడంతో కాంగ్రెస్‌లోనూ చర్చ
మూడు పార్టీల్లోనూ ఎమ్మెల్సీ ఫలితంపై విశ్లేషణ
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన పొలిటిల్ సీన్
MLC Results: రాష్ట్రంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ (MLC Elections) (రెండు టీచర్ల, ఒక గ్రాడ్యుయేట్) ఎన్నికల్లో రెండింటిని బీజేపీ(BJP) కైవసం చేసుకోవడం సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది. రెండు చోట్ల కాంగ్రెస్(Congress) అభ్యర్థుల్ని నిలబెట్టలేదు. బీఆర్ఎస్(BRS) మాత్రం ఒక్కరిని కూడా బరిలోకి దించలేదు. దీంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీఆర్ఎస్‌కు షిప్ట్ అయిందనే చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రాభవం కోల్పోతూ ఉండడంతో రాష్ట్రంలో ఇకపైన కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ(Congress Vs BJP) అనే కొత్త ముఖచిత్రం ఏర్పడిందన్న డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే ఉత్తరాది(North Telangana) జిల్లాల్లో బీజేపీ బలపడిందని, గత (2018) అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిస్తే 2023 ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది స్థానాలు రావడం, అందులో ఏడు ఉత్తరాది జిల్లాల్లోనివే కావడంతో ఆ ప్రాంతంలో పార్టీ స్ట్రాంగ్(Strong) అవుతుందనే చర్చ కూడా జరుగుతున్నది.
అధికార పార్టీకి కలిసిరాని స్థానం
ఆదిలాబాద్- నిజామాబాద్- కరీంనగర్-మెదక్ జిల్లాల పట్టభద్రుల(Graduate mlc) ఎమ్మెల్సీ స్థానం ఎప్పుడూ అధికార పార్టీకి అందని ద్రాక్షగానే ఉంటున్నది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి(Jeevan Reddy) గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా విపక్షంలో ఉన్న బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచారు. ఆ ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మూడు పార్టీల్లోనూ ఈ ఎన్నికలపై విశ్లేషణ మొదలైంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లభించిన మద్దతు గురించీ ఓటర్లలో చర్చ జరుగుతున్నది. బీజేపీ కృషి కారణంగా గెలిచిందా?.. బీఆర్ఎస్ పరోక్ష మద్దతు, ఓటు బ్యాంకు షిప్ట్ కావడం కారణమా?.. ఆలస్యంగా ప్రచారం మొదలుపెట్టడం వల్ల కాంగ్రెస్ ఓడిపోయిందా?.. బీఎస్పీ తరఫున పోటీ చేసిన హరికృష్ణ చీల్చిన ఓట్లు ప్రభావం చూపాయా?.. చెల్లని ఓట్లు కీలకంగా మారాయా?.. ఇలాంటివే ఇప్పుడు ఆసక్తికర చర్చలకు దారితీశాయి.
ప్రచారంలో వెనకబడిన కాంగ్రెస్
కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి పోటీ చేసినా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తగిన సహకారం అందలేదని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొనే సమయానికి థర్డ్ ప్లేస్‌లో ఉన్నారని, ఆ తర్వాతనే బీజేపీ అభ్యర్థిని ఢీకొట్టేంత స్థాయికి వచ్చారనే టాక్ ఆ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో చోటుచేసుకున్నది. ఏడాదిలో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలతో పట్టభద్రుల ఓట్లు పడినప్పటికీ టీచర్ల ఓట్లు భిన్నంగా పడ్డాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాటలు. జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత సమన్వయంతో పనిచేసినట్లయితే, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న కసితో రంగంలోకి దూకితే ఫలితం ఆశాజనకంగా ఉండేదన్న వాదన కూడా వినిపిస్తున్నది. దీనికి తోడు అభ్యర్థిని ప్రకటించేంత వరకూ ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్‌తోనే ఉన్నారని, కానీ టికెట్ రాకపోవడంతో బీఎస్పీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారని, థర్డ్ ప్లేస్‌లో నిలిచేంత స్థాయిలో తెచ్చుకున్న ఓట్లు కాంగ్రెస్‌ను డ్యామేజ్ చేసిందని, ఆయనను కంట్రోల్ చేసి ఉంటే గెలుపు సునాయాసం అయ్యి ఉండేదన్నది స్థానిక పార్టీ కేడర్ అభిప్రాయం.
బీజేపీకి మేలు చేసిన బీఆర్ఎస్
అభ్యర్థిని నిలబెట్టకూడదన్న బీఆర్ఎస్ వ్యూహం ఫలించడం మాత్రమే కాక బీజేపీకి పరోక్షంగా మేలు చేసినట్లయిందన్న వాదన కూడా ఆ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నది. ప్రసన్న హరికృష్ణకు మద్దతు పలికితే ఆయనకు బీఆర్ఎస్ తరఫున పరోక్ష ఓటు బ్యాంకు పెరుగుతుందని, ఆ మేరకు ఓట్ల చీలికతో బీజేపీకి మేలు జరుగుతుందనే ఆలోచన కూడా కొన్నిచోట్ల వర్కవుట్ అయిందన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఇంతకాలం బీఆర్ఎస్ వెనక ఉన్న టీచర్లు, పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారు?.. వారి ఓటు బ్యాంకు ఎవరికి అనుకూలంగా మారింది?.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఇప్పటికీ స్నేహం ఉన్నదనే వాదన ఈ ఎన్నికల్లో ఇలా ప్రతిబించిందా?.. ఇలాంటి అనుమానాలపైనా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ను గెలవనీయొద్దని బీఆర్ఎస్ పిలుపు ఇవ్వడం బీజేపీకి లాభం కలిగించేందుకేననే వాదనకు ఈ ఫలితంతో బలం చేకూరినట్లయింది.
ఉత్తరాదిన బీజేపీ స్ట్రాంగ్ అవతున్నట్లేనా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెల్చుకోలేకపోయిన బీజేపీ ఈసారి ఏ స్థానాలను గెల్చుకున్నది. ఆదిలాబాద్ (ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, ముథోల్, నిర్మల్), నిజామాబాద్ జిల్లాల్లోని (నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి) ఏడు ఎమ్మెల్యేలతో పాటు నాలుగు ఎంఫీలు (అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్) బీజేపీవే కావడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభావం గణనీయంగా కనిపించింది. దీనికి తోడు ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగి వారాల తరబడి స్థానికంగా మకాం వేసి ప్రతీ ఓటరు (గ్రాడ్యుయేట్, టీచర్)ను కలిసి మోటివేట్ చేయడం కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలవడానికి దోహదపడిందని రాష్ట్ర పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయంతో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు (కిషన్‌రెడ్డి, బండి సంజయ్) ఇక్కడే మకాం వేసి ప్రచారంలో విస్తృతంగా పాల్గొనడం కూడా మంచి ప్రభావం చూపిందన్నది వారి వాదన.