NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానుండటం మంచి పరిణామమేనని, ఇద్దరు సీఎంలు కలవాలనే తామూ కోరుకుంటున్నామని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పారు. వీరి సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చ జరుగుతుందని, అవి ఓ కొలిక్కి రావాలని ఆశిస్తున్నామని తెలిపారు. కానీ, ఈ సమావేశం ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని, చంద్రబాబుతో భేటీకి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది అనుమానమేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నాయని, కానీ, సీఎం రేవంత్ రెడ్డికి పాలన మీద ఇంకా పట్టురాలేదని ప్రభాకర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం పరిపాటిగా మారిపోయిందని, అక్కడికి వెళ్లి పడిగాపులు కాయడం అలవాటైందని ఆరోపించారు. కీలక శాఖలు సీఎం చేతుల్లోనే ఉన్నాయని, కానీ, వాటి అధికారులు మాత్రం ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉన్నాయన్నారు. అధిష్టానం కాంగ్రెస్ పాలనకు ఆటంకం కలిగిస్తున్నదని, రేవంత్ రెడ్డి పాలనపై ప్రభావం వేస్తున్నదని, సీఎంను ముక్కుతిప్పలు పెడుతున్నదని పేర్కొన్నారు.
దీపాదాస్ మున్షీ ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉండి నడిపిస్తున్నదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ మధ్య రాష్ట్రం నలిగిపోతున్నదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, ఖజానా ఖాళీ అయిందని చెప్పారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పడిగాపులు కాయడం కంటే అక్కడే ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం మంచిదని సెటైర్ వేశారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పాలిస్తున్నారా? లేక ఢిల్లీ పెద్దలు పరిపాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.