KV Ramana Reddy: బీజేపీలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్. కొద్దిరోజులుగా ఆయన సైలెంటయ్యారు. తాజా, మాజీ ముఖ్యమంత్రులను ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరు సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కాషాయ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీపై అలిగారా? లేదా ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉన్నారా? పార్టీ ఆయన్ను పక్కన పెట్టేసిందా? లేక ఆయనే పార్టీని పక్కకు పెట్టేశారా? అసలు ఎందుకు ఆయన సైలెంట్ అయ్యారనే అంశం బీజేపీ శ్రేణులతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ వెంటాడుతన్న ప్రశ్న. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkataramana Reddy) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,(KCR) తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించి రికార్డ్ సృష్టించారు. జాయింట్ కిల్లర్‌గా పేరు సాధించారు. పార్టీ వ్యవహారాలకు, మీడియాకు దూరంగా సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. అయితే, దీనికి కారణం కొందరు పార్టీ నేతల తీరేననే చర్చ జోరుగా సాగుతున్నది.
Also Read: Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఆసక్తికర పరిణామం.. ప్రత్యక్ష సాక్షికి సిట్ కీలక ఆదేశాలు!
అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం
బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాగా ఇటీవల పార్టీకి రాజాసింగ్(Raja Singh)రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 7కు చేరింది. అయితే తాజా, మాజీ సీఎంను ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరొందిన కాటిపల్లి తొలుత బీజేఎల్పీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, పార్టీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించింది. ఆ తర్వాత తాను ఆశించిన స్థాయిలో పార్టీలో కూడా ప్రాధాన్యత దక్కకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరోక్షంగా చెప్పినట్లుగా తెలుస్తున్నది.
అంతేకాకుండా హైడ్రా అంశంపై పార్టీ నిర్ణయాలు ఆయనకు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తున్నది. ఈ అంశంపై ఆయన్ను కనీసం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టుకునేందుకు కూడా అప్పటి నాయకత్వం అవకాశం ఇవ్వలేదని ప్రచారం జరుగుతున్నది. అందుకే అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కలేదు. ఆఖరికి మీడియా సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పెట్టుకుని వెళ్లిపోయారు. ఆ మీటింగ్‌లో ఆయన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లను ప్రస్తావించారు. అది రాష్ట్ర నాయకత్వంలోని పలువురికి నచ్చకపోవడంతో ఆయన్ను పార్టీ కూడా పట్టించుకోవడం మానేసిందనే ప్రచారం జరుగుతున్నది.
ప్రాధాన్యత ఇవ్వడం లేదని
తెలంగాణ కమల దళపతి నియామకం ప్రక్రియ మొదలు ప్రకటన వచ్చినా, బాధ్యతలు స్వీకరించినా ఆయన మాత్రం తనకేం పట్టదన్నట్లుగానే కాటిపల్లి ఉన్నారు. నూతన అధ్యక్షుడు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమానికి ఆయన హాజరైన దాఖలాలే లేవు. అంతకు ముందు ఎన్నో నెలల నుంచి కూడా ఆయన బీజేపీలో యాక్టివిటీస్‌లోనూ ఎక్కడా కనిపించలేదు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన తనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం తగినరీతిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోన ఆయన కుమిలిపోతున్నారనే ప్రచారం జరుగుతున్నది.
అందుకే ఆయన హర్ట్ అయ్యారని పలువురు చెబుతున్నారు. ఈ కారణంగానే అతను పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తున్నది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రోజుకో ప్రజాప్రతినిధితో ఇటీవల బీజేపీ భరోసా పేరిట వర్క్ షాప్‌ను నిర్వహిస్తున్నది. ఈ వర్క్ షాప్‌కు సైతం ఆయన హాజరు కావడం లేదు. షెడ్యూల్ ప్రకారం ఆయన అపాయింట్‌మెంట్ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సైతం దూరంగా ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు ఆయన ప్రజా సమస్యలపై చురుకుగా పాల్గొంటూ ప్రజలతో మైమేకమయ్యేవారనే పేరు కాటిపల్లికి ఉంది. ప్రజా కార్యక్రమాల్లో ఎప్పుడు చురుకుగా పాల్గొనే ఆయన సైలెంట్ అవ్వడంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సెగ్మెంట్ లో సైతం అడపా దడపా పలు కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారని శ్రేణులు చెబుతున్నాయి. పార్టీలో రాజాసింగ్ ది ఒక తీరు అయితే.. కాటిపల్లిది మరో తీరని చర్చించుకుంటున్నారు. రాజాసింగ్ చెప్పాలనుకున్నదాన్ని మీడియా ద్వారా అయినా పంచుకుంటారని, అవసరమైతే సొంత పార్టీపై కూడా విమర్శలు చేసేందుకు వెనుకాడరని శ్రేణులు చెబుతున్నాయి. ‘
కానీ కాటిపల్లి మాత్రం ఇలా పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉంటే ఎలా తమకు తెలుస్తుందనే వారూ లేకపోలేదు. మొత్తానికి కాషాయ పార్టీకి, కామారెడ్డి ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ కొనసాగుతుందనేది సుస్పష్టంగా ఉంది. గతంలో సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు పార్టీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వచ్చారు. త్వరలో కొత్త కమిటీ సైతం ఏర్పాటుకానుంది. ఇప్పటికైనా ఆయన తన మౌనాన్ని వీడి పార్టీతో కలిసి పనిచేస్తారా? లేదా? అనేది చూడాలి. లేదా రాష్ట్ర నాయకత్వం అయినా సైలెంట్ మోడ్ లో ఉన్న వెంకట రమణారెడ్డిని యాక్టివ్ మోడ్ లోకి తీసుకువస్తుందా? లైట్ తీసుకుంటుందా? అనేది చూడాల్సిందే.
Also Read: Metro: ఓల్డ్ సిటీ మెట్రో పనులు ఎక్కడ వరకు వచ్చాయంటే?