Etela Rajender
Politics

Eatala Rajender: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం

Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుంచి ఘన విజయం సాధించారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వానికి జై కొట్టారని అన్నారు. మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని బీజేపీకి ఓటు వేశారని వివరించారు. అందుకే బీజేపీ అభ్యర్థులను వారంతా నిండు మనసుతో ఆశీర్వదించారని తెలిపారు. ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చి వారి నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేశారని చెప్పారు.

గతంలో కంటే బీజేపీ రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకుందని, అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో గణనీయమైన ఓటు షేర్‌ను సాధించిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగిందని వివరించారు. ఖమ్మం, మహబూబాబాద్ తప్పితే ఒడిన మిగిలిన ఏడు స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని అన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులు అపార అనుభవంగల వారని ఈటల వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి సహాయ సహకారాలను తీసుకుంటామని తెలిపారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరిస్తే వెంటపడి మరీ పనులు చేయిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇళ్లు కట్టించడం తమ బాధ్యత అని తెలిపారు.

ఇక కొందరు నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, ఎన్డీయే కూటమికి మెజార్టీ సీట్లు వస్తే.. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని వెకిలి మాటలు మాట్లాడుతున్నారని ఈటల మండిపడ్డారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారని, మంచి ఫలితాలను పొందామని వివరించారు. అలాంటిది.. కాంగ్రెస్ కూటమి నాయకులు చంద్రబాబును, నితీశ్ కుమార్‌ను కలుస్తారని, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారని, ఇది సరికాదని చెప్పారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు సంపూర్ణంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!