bjp protest at indira park
Politics

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: బీజేపీ డిమాండ్

– సూత్రధారులను అరెస్టు చేయాలి
– కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం వహిస్తున్నది?
– కాంగ్రెస్ అధిష్టానంతో కేసీఆర్‌కు డీల్ సెట్ అయిందా?
– ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నాయకుల నిరసన

MP Laxman: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉన్నట్టు నిందితులు వాంగ్మూలాలు ఇస్తున్నా రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ.. వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. అధికారంలోకి రావడానికి ముందు కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని అనుమానించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌ నాయకులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించింది. బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్నా ఇంకా రుణమాఫీ చేయలేదని, వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇవ్వలేదని ఎంపీ లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు స్వల్ప కాలంలోనే తెలుసుకుని పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు.కాళేశ్వరం, ధరణి పేరుతో కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తానని ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, ఇప్పుడు కేసీఆర్ పైనా విమర్శలు చేయడం లేదని చెప్పారు.

టెలికాం రెగ్యులేటరీకి భిన్నంగా, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఈ కేసులో అరస్ట్ అయినవాళ్లు వాంగ్మూలాలు ఇస్తున్నప్పటికీ నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేసిన కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్‌తో ఏమైనా లోపాయికారి ఒప్పందం చేసుకుందా? అని అడిగారు. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్నా ఫోన్ ట్యాపింగ్ నిందితులను శిక్షించాలని, బీఆర్ఎస్ నాయకులను ఏమాత్రం కాపాడాలని సీఎం ప్రయత్నించినా రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని అన్నారు. బీఎల్ సంతోష్ మీద అక్రమ కేసు పెట్టారని, ఈ కేసుతో లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించాలని కేసీఆర్ భావించారని చెప్పారు.

బీఆర్ఎస్‌ను రద్దు చేయాలని ఈసీకి లేఖ రాస్తా:

ఒకే కుటుంబం నుంచి ఐదారుగురు వ్యక్తులు పాలించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇలాంటి కుటుంబ పార్టీలు ఉండకూడదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. 2017 కంటే ముందు నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, 2018లో బీఆర్ఎస్ ఓడిపోతుందని చాలా మందిని హింసించారని ఆరోపించారు. టెలిగ్రాఫ్‌తోపాటు ఇతర యాక్ట్‌ల కింద కేసు నమోదు చేయాలని, ఒక వేళ నిందితులను శిక్షించకపోతే బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌కు ఒప్పందం ఉన్నదని ప్రజలకు అర్థం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ డిజాల్వ్ చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తానని అన్నారు.

నయీం తరహా పాలన:

గత ప్రభుత్వం నయీం తరహా పాలన సాగించిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శలు సంధించారు. సొంతం కుటుంబంపైనా అదీ సొంత అల్లుడిపైనా ఫోన్ ట్యాప్ చేసి నిఘా పెట్టారని ఆరోపించారు. వ్యాపారులను బెదిరించి చిత్రహింసలు పెట్టారని, వీరి వల్ల సెలెబ్రిటీల పెళ్లి పెటాకులు అయ్యాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై కేసులు పెట్టొద్దని సోనియా గాంధీ బెదిరించిందని ఆరోపించారు. అందుకే రేవంత్ రెడ్డి చిన్న ముఖం పెట్టుకుని వచ్చాడని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బంధం తేటతెల్లమైందని పేర్కొన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు