Politics

Telangana : నిబంధనల మేరకే కమిషన్ ఏర్పాటు

– నాటి మంత్రి కోరిన మీదటే విచారణ
– రూల్స్ ప్రకారమే నోటీసుల జారీ
– మాజీ సీఎం అభ్యంతరాల్లో వాస్తవం లేదు
– జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు సబబే
– హైకోర్టులో తెలంగాణ ఏజీ సుదర్శన రెడ్డి
– కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

Big Shock to KCR in High Court : విద్యుత్ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చెల్లదంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటీషన్ మీద శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గురువారం కేసీఆర్ తరపు న్యాయవాది తన వాదన వినిపించగా, శుక్రవారం ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. అనంత‌రం కేసీఆర్ పిటిష‌న్‌పై తీర్పును రిజ‌ర్వ్ చేసిన‌ట్లు హైకోర్టు ప్రకటించింది.

ఏజీ వాదన ఇదీ..

విద్యుత్ కొనుగోలుపై ఎంక్వయిరీ చేయాలని గతంలో శాసన సభలో ఆ శాఖకు మంత్రిగా ఉన్న జి. జగదీశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన కోరిన మీదట ప్రభుత్వం విచారణకు సిద్ధపడిందనీ, కనుక ఇప్పుడు పిటిషనర్ చెబుతున్నట్లుగా ఇది ఏకపక్ష నిర్ణయం కాదని అర్థమవుతోందని సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తికి వివరించారు. కమిషన్ ఛైర్మన్ నర్సింహారెడ్డి విచారణ జరుగుతుండగానే, మీడియాతో మాట్లాడారని మాజీ సీఎం అభ్యంతరం చేశారని, కానీ, సదరు ఛైర్మన్ తన ప్రెస్‌మీట్‌లో కేవలం విచారణ జరుగుతున్న తీరును మీడియాతో పంచుకున్నారే తప్ప, విచారణకు సంబంధించిన కీలక అంశాలను మాట్లాడటం గానీ, దానిపై తన అభిప్రాయాలను గానీ చెప్పలేదని గుర్తుచేశారు.

అందరినీ పిలిచాం..

ఈ కేసులో ముందుగా అధికారులను, నిర్మాణ సంస్థల వారిని విచారించిన తర్వాత నిబంధనల ప్రకారమే మాజీ సీఎం కేసీఆర్‌కు రెండుసార్లు నోటీసులు పంపామని, విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై పబ్లిక్ నోటీస్ సైతం జారీ చేశామని సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. విచారణ అంతా పారదర్శకంగా జరగుతోందని, ఇప్పటివరకు 15 మంది నుండి వివరాలు సేకరించామని తెలిపారు. ఈ విచారణకు విద్యుత్ వ్యవహారాల సంస్థకు బాధ్యుడిగా ఉన్న ప్రభాకర్ రావు, నాటి మంత్రి జగదీష్ రెడ్డి కూడా కమిషన్ ముందు హాజరైన సంగతిని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారమే ఎంక్వయిరీ కమిషన్ యాక్ట్ 8(b) కింద కమిషన్ ముందుకు వచ్చి తన వద్ద ఉన్న సాక్షాలను ఇవ్వాలని మాత్రమే మాజీ ముఖ్యమంత్రిని నోటీసులో కోరినట్లు ఏజీ వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యతతో, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తోందని, కనుక పిటిషనర్ చెబుతున్నట్లుగా ఎక్కడా ఏకపక్ష నిర్ణయాలు లేవని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. అనంతరం ఈ అంశంపై విచారణ ముగిసిందని ప్రకటించిన కోర్టు తీర్పును వాయిదా వేసింది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?