– సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఎక్కువ ఇవ్వాలి
– బలహీనులకు రుణాలిస్తేనే సమగ్ర అభివృద్ధి
– మహిళా సంఘాల ఆర్థిక వృద్ధి తమ లక్ష్యం
– బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
Loans: నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని, బలహీనవర్గాలకు విరివిగా రుణాలిస్తేనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయకోణం ఉండాలని, వారికి పాజిటివ్ దృక్పథం లేకుంటే ఏ రాష్ట్రమూ అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలని, అవి ఎక్కువ జనాభాకు ఉపాధిని కల్పిస్తున్నాయని తెలిపారు. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సాగురంగానికి సంబంధించి చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెండింగ్‌లో పెట్టదని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం అని భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో తెలంగాణ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందని వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నదని, రెప్పపాటు కరెంట్ కోత కూడా లేదని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురానున్నట్టు పేర్కొన్నారు.
హరీశ్ రావుకు కౌంటర్
మాజీ మంత్రి హరీశ్ రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్ల పాలనను హరీశ్ రావు మరిచిపోయారా? అని అడిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తమ ఫస్ట్ ప్రయారిటీ అని తేల్చి చెప్పారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వ్యక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని పేర్కొన్నారు.