– పేదలు, మధ్యతరగతికి రుణాలివ్వాలి
– రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు కలిసి రావాలి
– వృద్ధి నమోదులో ముందున్నాం
– రాజధాని విస్తరణతో అభివృద్ధి వేగవంతం
– బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి
– గ్రామాల్లో బ్యాంకు సేవల విస్తరణ
– రైతుకు మరింత సాయం అందిద్దామన్న మంత్రి తుమ్మల
– రేపే కేబినెట్ భేటీ, రుణమాఫీ రూట్‌మ్యాప్‌పై చర్చ
Dy CM Bhatti: బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ మ్యారీగోల్డ్ హోటల్‌లో జరిగిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన హాజరయ్యారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులు సానుకూల దృక్పథంతో ఆలోచన చేస్తేనే సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నిరుపేదలు, మధ్యతరగతికి రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు మానవీయకోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమాజంలో సగానికి పైగా ఉన్న పేదలు, మధ్యతరగతి అభివృద్ధి చెందితేనే ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు.
వృద్ధి నమోదులో ముందున్నాం..
చిన్న రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ వృద్ధి నమోదులో మంచి ఫలితాలు సాధిస్తోందనీ, రాజధాని నగరమైన హైదరాబాద్ ఏటికేడు విస్తరిస్తూ పోతోందని ఉప ముఖ్యమంత్రి గుర్తుచేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నగర పరిధిని మరింత పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు మరింత డిమాండ్ ఏర్పడబోతోందని, అందుకే వ్యవసాయ రంగాన్ని మరింత ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని వివరించారు. ఆయిల్ ఫామ్ సాగుతో బాటు ప్రత్యామ్నాయ పంటలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలపారు. ఎక్కువమందికి ఉపాధిని కల్పించే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉందని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది ఉండదని, త్వరలో ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందని భట్టి వెల్లడించారు.
రైతుకు ఊతమిద్దాం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణలో 6,415 బ్యాంకు శాఖలున్నప్పటికీ, వాటిలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల సంఖ్య 1,874 మాత్రమేనని తెలిపారు. బ్యాంకులన్నీ తమ శాఖలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. తెలంగాణ 73.11 శాతం భూములు చిన్న,సన్నకారు రైతుల వద్దనే ఉన్నాయనీ, అన్నదాతలకు రుణాలు అందించటం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయగలుగుతామని తెలిపారు. తమ వద్ద పంటరుణాలు తీసుకున్న రైతుల వివరాలను జాగ్రత్తగా నిర్వహించాలని, లేకపోతే వారు ప్రభుత్వం అందించే పథకాల సాయం కోల్పోయే ప్రమాదం ఉందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకుల నుండి ప్రోత్సాహం కరువైందనీ, ఈ సీజన్ నుంచైనా బ్యాంకులు ఆయిల్ పామ్ రైతులకు ఉదారంగా రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో మౌలికసదుపాయాల కల్పనకు ఇచ్చే రుణాల మొత్తాలను బ్యాంకులు పెంచితే రైతులకు మేలు జరుగుతుందని బ్యాంకర్లకు గుర్తుచేశారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను బ్యాంకులు గుర్తించి, అందుకు సహకరించాలనీ, అప్పుడే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
రేపే కేబినెట్ భేటీ
మరోవైపు.. రేపు (శుక్రవారం) తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 15 నాటికి అమలు చేయబోయే పంట రుణాల మాఫీ పథకంపై కేబినెట్ చర్చించనుంది. రుణ మాఫీ పథకం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలు, దీనికి అవసరమైన నిధులు, పథకం అమలుకు కటాఫ్ డేట్ వంటి పలు నిర్ణయాలను రేపటి మంత్రివర్గ భేటీలో సీఎం.. మంత్రులతో చర్చించనున్నారు.