Bandi Sanjay: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ధీమా వ్యక్తంచేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న తన కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు.. గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, గల్లీలోనూ కాషాయ జెండా ఎగురవేయబోతున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సమరంలో ఈసారి బీజేపీ కొత్త చరిత్రను లిఖించబోతోందని జోస్యం చెప్పారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. ఆసియా కప్, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లలో ఇండియా ఘన విజయం సాధించినట్లుగానే త్వరలో జరగబోయే కరీంనగర్ పల్లె లీగ్(కేపీఎల్ లీగ్), సిరిసిల్ల పల్లె లీగ్(ఎస్పీఎల్) స్థానిక పోటీల్లోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్నారు.
Also Read: Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి
కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలు
పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న నిఖార్సైన బీజేపీ కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. టిక్కెట్లు ఇవ్వడంతోపాటు గెలిపించుకుని కాషాయ కార్యకర్తల నుదుటిన విజయ తిలకం దిద్దుతామని తెలిపారు. నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలవల్ల స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు నిధులివ్వకపోవడమే కాక అభివృద్ధి పేరుతో నాటి సర్పంచులు చేసిన పనులకు కూడా బిల్లులివ్వకుండా వేధించిందని బండి ధ్వజమెత్తారు. కేంద్ర నిధులను సైతం దారి మళ్లించారన్నారు. కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవంటూ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా చేతులెత్తేసిందని కేంద్ర మంత్రి విమర్శలు చేశారు.
అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు
దేశ చరిత్రలో 22 నెలలుగా పంచాయతీలకు నయాపైసా విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లి ఎండగడతామని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన పాపాలను సైతం వివరించి ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బండి వివరించారు. బీజేపీ కార్యకర్తలకు తాను చెప్పేదొక్కటేనని, ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న నాయకులకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామని బండి తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు ఒక దఫా సర్వే పూర్తి చేశాయన్నారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో ఆదివారం నుంచే సర్వే టీంలు రంగంలోకి దిగాయని బండి తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా పట్టుబడితే.. ఏం చేశారంటే?
బాండ్ రాసిస్తా.. బీఆర్ఎస్ కు అధికారం రాదు.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు
భవిష్యత్ లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ లేదా బీజేపీయేనని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని, కావాలంటే బాండ్ పేపర్ రాసివ్వమంటే రాసిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదని, అది ఎక్స్ పైర్ అయిపోయిందన్నారు. కేటీఆర్ కు కుక్క కూడా ఓటేయదని విమర్శలు చేశారు. కేటీఆర్ సిరిసిల్ల చిత్తు పేపర్ గా మిగిలిపోతారని చురకలంటించారు. కల్వకుంట్ల కుటుంబాన్నీ నమ్మే రోజులు పోయాయని, బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం కేసీఆర్ కు గేమ్ ఆడే ఓపిక లేదు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు గేమ్ ఆడే ఓపిక లేదన్నారు. బీఆర్ఎస్ లో 2028 వరకు ఎవరు ఏ జైళ్లో ఉంటారో తెలీదని పేర్కొన్నారు. అంత భారీస్థాయి స్కామ్ లు చేశారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్.. తనను జైల్లో పెట్టిన ఘటన మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. అర్థరాత్రి తీసుకెళ్లి జైల్లో పెట్టినా రేవంత్ కు పౌరుషం లేదా అని అర్వింద్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేనని అర్వింద్ తెలిపారు. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ స్థానం తామే గెలుస్తున్నట్లు ధీమా వ్యక్తంచేశారు. భవిష్యత్ లో కల్వకుంట్ల కవిత ఎక్కడా పోటీ చేయదని అర్వింద్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా కోడలైన కవితకు శ్రేయోభిలాషిగా చెబుతున్నానని, ఆమె పార్టీ పెట్టవద్దని అర్వింద్ సూచించారు.
Also Read: Local Body Reservations: పకడ్బందీగా రిజర్వేషన్లు.. ఈ లెక్కల ప్రకారమే ప్రభుత్వ వ్యూహం