Ballot Box: ఈవీఎంలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు, బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదానికి దారి తీశాయి. మూడోసారి ఎన్డీఏ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. ఈ నేపథ్యంలోనే మస్క్ ఇండియాలో జరిగిన ఎన్నికలపై చేసిన కామెంట్స్ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. 2018 ఎలక్షన్స్‌లో తన విషయంలో జరిగిన అవకతవకలన్నీ ఆయన అభ్యంతర రూపంలో విన్న పరిస్థితి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనితీరుపై ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని గానీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి ఎంక్వయిరీని గానీ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని సూచించారు.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అని, ఈవీఎంల వల్ల వాటి యొక్క సామర్థ్యాన్ని భారతదేశంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కేస్ పెండింగ్‌లో ఉందని, ఇది కొంత అసహనానికే గురి చేస్తోందని తెలిపారు. మళ్లీ బ్యాలెట్ సిస్టం తీసుకురావాలని డిమాండ్స్ వస్తున్నాయంటే ఈవీఎంలపై అనుమానాలు ఉండడం వల్లేనని వివరించారు. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న అద్దంకి, భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని మార్చేసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాలను తెలపడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు అని, అలాంటి ఓటునే కరెప్ట్ చేసే పనిలో హ్యాకర్స్ ఉన్నారని విమర్శించారు. దేశం నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలనుకుంటే వీటిపై ఎంక్వయిరీ జరగాలని చెప్పారు. పారదర్శకమైన ఎంక్వయిరీతో పాటు బ్యాలెట్ విధానాన్ని తీసుకొస్తేనే ప్రజాస్వామ్య పునాదులు గట్టిపడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవకతవకలను దేశం ముందు ముందు భరించలేదని, ఇప్పటికైనా వీటిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచనలు చేశారు అద్దంకి దయాకర్.