- ఒకప్పుడు పర్యాటకులకు స్వర్గధామంగా నిలచిన రుషికొండ రిసార్ట్స్
- రూ.500 కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్యాలెస్
- అనుమతులు లేకుండానే సీఎం క్యాంప్ ఆఫీసు
- మయసభను తలపించేలా పెద్ద హాళ్లు
- అతి పెద్ద బాత్ రూమ్, ఖరీదైన ఫర్నిచర్
- ఎవరినీ చూసేందుకు అనుమతివ్వని జగన్ సర్కార్
- వెలుగులోకి తెచ్చిన టీడీపీ మంత్రి
- మీడియా సమక్షంలో అఖిలపక్షాలనూ ఆహ్వానించిన మంత్రి
AP Rushikonda changed as richest cm jagan camp office:
ఒకప్పుడు పర్యాటకులకు స్వర్గధామం అది. విదేశీ పర్యాటకును ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్రం బీచ్ లను స్వచ్ఛంగా మార్చే కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ కోస్ట్ జోన్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టు పేరుతో ప్రపంచబ్యాంక్ నిధుల సాయంతో దేశంలో కొన్ని బీచ్ ల డెవలప్ మెంట్ కు నాంది పలికింది. ఎంపిక చేసిన బీచ్ లను ‘బ్లూఫ్లాగ్ తీర ప్రాంతాలు’గా మార్చేందుకు నడుం బిగించింది. దేశ వ్యాప్తంగా 13 బీచ్ లను సిద్ధం చేయగా దేశీయంగా పరిశీలించిన కమిటీ వాలిలో కేవలం 8 బీచ్ లను ఎపిక చేసింది. అందులో ఏపీ నుండి ఒక్క రుషి కొండ బీచ్ మాత్రమే స్థానం పొందడం విశేషం.
విలాసవంతమైన భవనాలు
పచ్చదనంతో కళకళలాడే రుషికొండ అందాలను చిదిమేసి రాళ్లు రప్పలతో కూడిన కొండగా మార్చి.. విలాసవంతమైన భవనాలు నిర్మించారు ఏపీలో గత ప్రభుత్వం. మాయాబజార్ సినిమాలోని మయసభను తలపిచేలా పెద్దపెద్ద గదులు, హాల్స్, ఫర్నీచర్‌తో నింపేశారు. అనుమతులు లేకపోయినా.. జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలు అని తొలుత ప్రచారం చేసి తర్వాత పరిపాలన భవనాలని ప్లేట్ మార్చేశారు. తీరా ఇప్పుడు అధికారం మారిపోవడంతో ఆ భవానాల గుట్టు బయటపడింది. ఏడు బ్లాక్‌లుగా భవనాలు నిర్మించగా కళింగ బ్లాక్‌లోనే సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చొనే కంట్రోల్ రూం, 175 మంది కూర్చొనే సభ మందిరం నిర్మించారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్‌తో కోట్లు కుమ్మరించి నిర్మించారు.
రాజమహల్ రహస్యం అదే..
రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి… కట్టిన ప్యాలస్‌లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్ కోసమే! కట్టింది జనం ధనంతోనే..! ఇదీ నాడు ప్రతిపక్షాల నుంచి వచ్చిన ప్రధాన ఆరోపణ. సీన్ కట్ చేస్తే.. అసలు ఏంటీ రాజమహల్ రహస్యం..? ఇందులో ఏమేం ఉన్నాయ్..? అనే విషయాలు లోపలికి వెళ్లి పరిశీలిస్తే గానీ తెలియలేదు. ఇన్నాళ్లుగా నెలకొన్న రుషికొండపై ఉత్కంఠకు తెరపడింది..రుషికొండపై పర్యాటక రిసార్టును ధ్వంసం చేసి ప్రజాధనంతో జగన్ విలాసవంతమైన రాజమహల్ నిర్మించారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువైపు ఎవరినీ అనుమతించలేదు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో… రుషికొండపై నిర్మాణాలను మొదటిసారి మీడియా సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి గంటా పరిశీలించారు.
ఎవ్వరికీ అనుమతి లేదు
భవన సముదాయ ప్రాంగణాన్ని, అక్కడే ఉన్న పార్కును సందర్శించి, సముద్రం అభిముఖంగా ఉన్న నిర్మాణాల తీరు, ఇక్కడి భవనాల్లోని అన్ని గదులు, వినియోగించిన సామగ్రిని పరిశీలించారు. సువిశాలంగా నిర్మించిన మరుగుదొడ్లు, బాత్‌టబ్, పడక గదులను చూసి నాయకులు నివ్వెరపోయారు. కళింగ బ్లాకులోని రెండు భవనాలు, భారీ సమావేశ మందిరాలు, బ్లాకులు, షాండ్లియర్లను పరిశీలించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు. ‘నాటి ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తదితరులు ఇక్కడి నిర్మాణాలను చూసేందుకు వస్తే అనుమతించలేదు. ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైన జగన్ విధ్వంసకర పాలన ఐదేళ్లు కొనసాగింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ వచ్చేస్తున్నామంటూ వివిధ పండుగల పేర్లు చెప్పి వాయిదాలు వేశారు. చివరికి జగన్ రాకుండానే పదవీకాలం ముగిసిపోయింది. జగన్ విశాఖలో ఉండాలన్న ఆకాంక్షతో కనువిందు చేసే పర్యాటక ప్రాజెక్టును దెబ్బతీశారు’ అని గంటా ధ్వజమెత్తారు.
500 కోట్ల ప్రజాధనం
‘ప్రభుత్వం ఏదైనా కట్టడం చేపడితే దాని ఖర్చు, విస్తీర్ణం, వసతుల కల్పన వంటి వివరాలను వెల్లడిస్తుంది. దానికి భిన్నంగా దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యంత గోప్యంగా ఈ భవనాలు నిర్మించారు. లాభాల్లో నడుస్తున్న పర్యాటక రిసార్టును ధ్వసం చేసి మరో నిర్మాణం ఎందుకు చేపట్టారో చెప్పలేదు. ముందు పర్యాటక ప్రాజెక్టు, ఆపై ముఖ్యమంత్రి అతిథిగృహం, తరువాత స్టార్ హోటల్ అన్నారు. అనుమతి లేదని, చట్ట విరుద్ధమని ప్రజావేదికను కూల్చేసిన జగన్… రుషికొండలో రాజమహల్‌కు అనుమతులు ఎలా వచ్చాయో చెప్పాలి. రూ.500 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవనాలను రహస్యంగా పర్యాటక మంత్రితో ప్రారంభోత్సవం చేయించారు. ఈ భవానాల్లో వాడిన మార్బుల్స్, శానిటరీ సామగ్రి, విద్యుత్తు పరికరాలు, ఫర్నిచర్, ద్వారాలు ఎంతో ఖరీదైనవి. జగన్ కలల సౌధాన్ని నిర్మించుకున్నా ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు. హెలికాప్టర్‌పై కొండచుట్టూ తిరిగి చూసుకున్నారు’ అని గంటా ఎద్దేవా చేశారు.