AP Politics( image credit: X)
Politics

AP Politics: ఏపీలో ఖాకీ ఫైట్.. ఎవ్వరూ తగ్గట్లే.. కంట్రోల్ అయ్యేనా?

AP Politics: వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య ‘ఖాకీ’ ఫైట్ ఓ రేంజిలో నడుస్తోంది. ఇందులో అటు ఫ్యాన్ పార్టీ నేతలు, మాజీలు.. ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నాన్ స్టాప్‌గా సాగుతోంది. దీనంతటికీ కారణం రాప్తాడు పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలే. ‘ చంద్రబాబు మెప్పు కోసం వాళ్ల టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్‌ కొట్టకుండా చంద్రబాబు చెప్పినట్లు చేస్తే.. అలాంటి పోలీసుల బట్టలు ఊడదీసి ప్రజల ముందు దోషులుగా నిలబెడుతాం. మీ ఉద్యోగాలు ఊడగొడతాం. ప్రతి పోలీసు అధికారి మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి. మీరు చేసిన ప్రతి పనికీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తాం. అలాగే మిమ్మల్ని తప్పకుండా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం’ అని పోలీసులకు జగన్‌ హెచ్చరించారు.

ఇప్పుడీ కామెంట్స్ రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్‌గా మారింది. అటు పోలీసు సంఘాలు, ఉన్నతాధికారులు ఇటు హోం మంత్రి మొదలుకుని తెలుగు తమ్ముళ్లు.. జగన్‌కు గట్టిగానే ఇచ్చిపడేస్తున్నారు. అయితే ‘ చంద్రబాబుకు ఊడిగం చేయొద్దని అధినేత వార్నింగ్ ఇస్తే మీరెందుకు మీడియా ముందుకొస్తున్నారు? అందులో తప్పేముంది? మీ పేరెత్తి విమర్శించారా? పోనీ మీరేమైనా తక్కువా?’ అంటూ నాటి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అనిత ఇలా ఒకరా ఇద్దరా కాదు పలువురి నేతల వీడియోలు వందలకొద్దీ తవ్వితీసిన వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ వైరల్ చేస్తున్నాయి. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

తెలిసి కూడా ఎందుకిలా?
వాస్తవానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీ నేతలు చెప్పినట్లు తూ.చ తప్పుకుండా పాటించడం పోలీసులకు పరిపాటిగా మారిపోయిందని అపవాదు ఉంది. ఇది గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎప్పట్నుంచో నడుస్తున్నదే. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ద్వితియశ్రేణి నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏం చెప్పినా తల ఆడిస్తూ పోలీసులు చేస్తున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. ఈ క్రమంలో ఇదే అదునుగా తీసుకొని కొందరు ఖాకీలు విర్రవీగి, వార్తల్లో నిలిచిన సందర్భాలూ ఉన్నాయి. ఇదే మాటకొస్తే గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చెప్పినట్లుగా చేయలేదా? అంటే అక్షరాలా చేశారు, చేసి తీరాల్సిందే కూడా.

ఇప్పుడు కూటమి అధికారంలో ఉండగా ఇదే జరుగుతోంది. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం అనేది పోలీసులను ఆడిస్తోందని, పేరుకే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ ఉంటారు కానీ అవేమీ ఆచరణలోకి రావని వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ.. ఇప్పుడు కూటమి అధికారంలో ఉండగా వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పట్నుంచి ఇవన్నీ తెలిసిన, సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వైఎస్ జగన్ పదే పదే పోలీసులపై ఇలా మాట్లాడటమేంటి? అనేది విచిత్రంగా ఉందన్నది సొంత పార్టీలోనే ఒకింత నేతలు నొచ్చుకుంటున్న పరిస్థితి.

ఎవరి వర్షన్ వారిదే!
2019-2024 మధ్య పోలీసులను చంద్రబాబు అత్యంత నీచంగా చూస్తూ, వారిపైకి పలుమార్లు కార్యకర్తలను దాడికి ఉసిగొల్పిన సందర్భాలు చాలానే ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తున్నది. అంతేకాదు పోలీసులను తీవ్ర పదజాలంతో బహిరంగ వేదికలపై చంద్రబాబు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్ తీవ్ర విమర్శలు, అంతకుమించి బండ బూతులు తిట్టిన వీడియోలను సైతం సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తున్నది. ఇవన్నీ పోలీసులపై టీడీపీ చేసిన దూషణలు కావా? కనిపించవా? వినిపించవా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.

కనీసం మహిళల ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియని వాళ్లు ఇవాళ మంత్రులుగా అధికారాన్ని వెలగబెడుతున్నారు? సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన నేతలను ఏమనాలి? గతంలో చేసినదంతా చేసి ఇప్పుడు మాత్రం పోలీసులపై తెగ ప్రేమని ఒలకబోస్తూ శుద్ధపూస కబుర్లా చంద్రబాబు అండ్ కో? అంటూ వైసీపీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున వీడియోలను వైరల్ చేస్తున్నాయి. అయినా వైఎస్ జగన్ కేవలం ‘ పోలీసులూ చట్టానికి సెల్యూట్ చేయండి. చట్టానికి లోబడి పని చేస్తే సెల్యూట్.. నారా చంద్రబాబు నాయుడు మెప్పు కోసం పని చేస్తే మాత్రం యూనిఫామ్ తీపించడమే’ అని మాత్రమే అన్నారు కానీ ఎక్కడా ఇందులో తప్పేముంది? రాయలేని భాష ఏమీ ఉపయోగించలేదు కదా? అని వైసీపీ తమ వర్షన్ చెబుతోంది. అయితే టీడీపీ మాత్రం మాజీ సీఎం నోట ఇలాంటి మాటలు రావడమేంటి? ఆది నుంచీ జగన్ అంతేనని, పోలీసులను పదే పదే హెచ్చరించడం, బట్టలు ఊడదీయడం అంత ఈజీనా? లేకుంటే అంత ఇష్టమా? అంటూ విమర్శలు, సెటైర్లు వర్షం కురిపిస్తున్నది.

సుధాకర్‌కు ఆ ఆస్తి ఎక్కడిది?
‘ తాను నిజాయితీ గల అధికారి అన్నట్టు ఎస్సై సుధాకర్‌ యాదవ్ మాట్లాడుతున్నాడు. సుధాకర్‌ యాదవ్‌ తండ్రికున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేసి చినమత్తూరు దగ్గర ఫాంహౌజ్‌ కొన్నాడా? రాంనగర్‌లో పెంట్‌ హౌజ్‌ కొన్నాడా? డస్టర్‌ కారు, కర్నూల్‌లో బంధువుల పేరుతో అపార్ట్‌మెంట్‌ ఇవన్నీ ఎలా వచ్చాయి? లేపాక్షి హబ్‌లో మట్టిని అమ్మేసి కోళ్ల ఫారం రూ.2 కోట్లతో కడుతున్న మాట వాస్తవమా? కాదా?’ అని వైసీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు ‘ అయ్యా సుధాకర్ యాదవ్ తమరు ఎవరి కోసం పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. తమరే కదా పోయిన ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ కోసం ప్రయత్నించి రాలేదని, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారని తాపత్రయ పడుతున్నారో అందరికీ తెలుసు కొద్దిగా వెయిట్ చేయండి’ అని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు ఆయన ఆస్తులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్‌ను సైతం వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.

హోం మంత్రి అనిత 
ఒంటి మీద ఖాకీ చొక్కా పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్? మహిళా ఎస్పీని బట్టలు ఊడదీస్తా అంటావా? జగన్ మాట్లాడిన ప్రతి మాట, గత 5 ఏళ్ళలో ఆయన చేసిన అరాచకాలే గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. గత ఐదేళ్లలో పోలీస్‌ శాఖను నిర్లక్ష్యం చేశారు. పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌ పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక మత ఘర్షణలు లేవు. జగన్‌ కేవలం పులివెందుల ఎమ్మెల్యే. ఆయనకు 1+1 సెక్యూరిటీ మాత్రమే ఇస్తారు. మాజీ సీఎం అని జెడ్‌ ప్లస్‌ భద్రత కేటాయించాం. రాప్తాడులో 11 వందల మందితో బందోబస్తు కల్పించాం. వైసీపీ నేతలు కావాలనే ఇదంతా చేస్తున్నారు. జగన్ శవ, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ తగాదాలతోనే లింగమయ్య హత్య జరిగింది. రాజకీయ హత్యగా జగన్ చిత్రీకరిస్తున్నారు. లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తీరు బాధాకరం. జగన్ మానసిక పరిస్థితిపై జాలి పడుతున్నాం. జగన్ పాలనలో వైసీపీ సెక్షన్ల ప్రకారం పోలీసులు పనిచేశారు.

మంత్రి సవిత ఫైర్
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను చూసి జగన్ హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి. వైసీపీ పాలనలో ఎన్నో హత్యలు జరిగాయి. వేధింపులు తాళలేక అభాగ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. వారందరినీ ఆనాడు ఎందుకు పరామర్శించలేదు? శవ రాజకీయాలు నీకు అలవాటే. తండ్రి, చిన్నాన్న శవాలతో రాజకీయాలు చేశావ్. పోలీసులను తిట్టడానికే పాపిరెడ్డిపల్లి వచ్చావా? వారే లేకుంటే తిరిగి ఇంటికి వెళ్లేవాడివా? జగన్ పాలనను చూసి వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారు. అధికారంలో 30 ఏళ్లు అధికారంలో ఉంటామని కలలుగన్నారు. ఆ కలలు కల్లలు కావడంతో ఆయనకు మతిభ్రమించింది. హుందాగా వ్యవహరిస్తూ, తగిన సలహాలు సూచనలు అందజేస్తే పరిశీలిస్తాం. అంతేగాని, ప్రజలను రెచ్చెగొట్టేలా, వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదు.

మంత్రి సత్యకుమార్ యాదవ్
పోలీసులన్నా, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థల‌న్నా వంశ పారంప‌ర్యంగా జ‌గ‌న్‌కు ఏవ‌గింపు ఉంది. దుర్మార్గాల‌కు ప్రతీకైన ఆయన తాత రాజారెడ్డి నుంచి ఈ ల‌క్షణం అబ్బింది. ఆ విధంగా ఆయ‌న ర‌క్తంలో అది ప్రవ‌హిస్తోంది. పోలీస్ యూనిఫాం అనేది చ‌ట్టాల ప‌ట్ల నిబద్ధత‌కు చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే అన్న రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. క‌నుక‌నే ఫ్యూడలిస్టిక్ మాన‌సిక‌త‌కు మారుపేరైన జ‌గ‌న్ కుటుంబానికి చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే అన్న ఈ సూత్రం అంటే గిట్టదు. ఇత‌రుల‌క‌న్నా తాము భిన్నమ‌ని, చ‌ట్టాల‌కు తాము అతీతుల‌మ‌ని వారు భావిస్తారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ మ‌న‌సా వాచా ఈ విప‌రీత మ‌న‌స్తత్మాన్ని త‌న ప్రతి మాట‌లోనూ, ప‌నిలోనూ జ‌గ‌న్ వ్యక్తప‌ర్చుకున్నారు. పోలీసులు ఎంతో ప‌విత్రంగా భావించే యూనిఫాంకు జ‌గ‌న్ నుంచి ఎటువంటి ముప్పు రాద‌ని నేను వారికి హామీ ఇస్తున్నాను. జ‌గ‌న్ మ‌ర‌లా అధికారంలోకి రావ‌టం అసంభ‌వం.

కొల్లు రవీంద్ర 
వైఎస్ జగన్‌పై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదు? రక్షణగా ఉన్న పోలీసులనే బట్టలూడదీసి కొడతాననడం ఎంతవరకు కరెక్ట్? పోలీసులు ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించడం లేదు. జగన్ శవరాజకీయాలు చేస్తున్నారు. మాజీ సీఎం మానసిక స్థితి బాగోలేదు. రాప్తాడులో జరిగిన ఘటనను జగన్ రాజకీయం చేస్తున్నాడు. వైసీపీ హయాంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఆ రోజు జగన్ ఎందుకు పరామర్శకు వెళ్ళలేదు?

కాల్వ శ్రీనివాసులు 
ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికి 1100 మంది పోలీసులను కేటాయించారు. హెలిప్యాడ్ వద్ద 200మంది పోలీసులు ఉన్నా, జనం దూసుకొచ్చారు. పోలీసులపై రాళ్ల దాడి కూడా చేశారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైకోయిజంతో ఉన్నారో తెలుస్తోంది. లింగమయ్య హత్య కేసులో నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేశారు. అదే విధంగా పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. బీసీ పోలీస్ అధికారిపై దారుణ పదజాలం ఉపయోగించారు. సుధాకర్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. వారం లోపు క్షమాపణ చెప్పకపోతే, మీ మీద రాజకీయ యుద్ధం చేస్తాం. వీడియో కాల్స్ చేసినట్టు మీ దగ్గరున్న సాక్షాలేంటి? బీసీలకు క్షమాపణ చెప్పకపోతే, బీసీల ప్రతాపం చూపిస్తాం. లింగమయ్య కుటుంబానికి ఇప్పటి వరకు ఏం సాయం చేశావ్? బీసీల మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటే ఎవరూ ఓర్వరు. జగన్ మైండ్ దొబ్బింది, అతనింకా ఇంకా కోలుకోలేదు.

అంబటి రాంబాబు 
లా అండ్‌ ఆర్డర్‌ కాపాడాల్సిన పోలీసులు టీడీపీకి కొమ్ముకాస్తున్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారు. ఎన్నో మోసాలు చేసిన చంద్రబాబు పెద్ద చీటర్‌. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎస్‌ఐని కూడా ట్రాన్స్‌ఫర్‌ చేయలేని అనిత మీడియా ముందు అవాకులు, చవాకులు పేలుతున్నారు. హోంమంత్రి అనిత మైకు ముందు మాత్రమే మంత్రి. తెరవెనుక నడిపించేదంతా లోకేషే. అనిత ఎస్ఐను కూడా ట్రాన్స్‌ఫర్ చేయించలేరు. మా నేతలను బెదిరించి, భయపెట్టేవారికి పోస్టింగ్‌లు ఉంటాయి. నేనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. ఎందుకు కేసులు నమోదు చేయరని అడిగితే నాపైనే కేసు పెట్టారు. నేను కోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు నా ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తున్నారు. కచ్చితంగా మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. చట్టానికి వ్యతిరేకంగా ఓ వర్గానికి కొమ్ముకాస్తున్న వారిని కచ్చితంగా బట్టలిప్పి నుంచోబెడతాం.

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 
పాపిరెడ్డిపల్లిలో జయచంద్రారెడ్డి ఇంటిపై దాడి చేసింది హత్యకేసు నిందుతులే. వారిని అడ్డుకున్నందుకే కురుబ లింగమయ్య కుమారులు నిందుతులకు టార్గెట్‌ అయ్యారు. దాడిని అడ్డుకోవాల్సిన ఎస్సై సుధాకర్‌ ఆ పని చేయలేదు. ఇదే నిందితులు మా పార్టీ ఎంపీటీసీలను బెదిరించారు. స్వయంగా ఎస్సై సుధాకర్ మా ఎంపీటీసీలను బెదిరించాడు. పరిటాల సునీత టికెట్ ఇప్పిస్తుందని సుధాకర్ భావిస్తున్నాడు. మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టాడు సుధాకర్‌. ఇన్ని నేరాలు ఘోరాలు జరిగాయంటే అందుకు అతడి వైఫల్యమే కారణం.

జగన్‌‌ను విమర్శించే స్థాయి సుధాకర్‌కు ఉందా? రాజకీయ ప్రయోజనాల కోసం ఖాకీ చొక్కాను, యాదవ కులాన్నీ ఉపయోగించుకున్నాడు. దళితులను కించపరచడం, అవమానించడం చేశాడు. ఎన్నో దౌర్జన్యాలు చేయించి, ఖాకీ ధర్మాన్ని పక్కన పెట్టిమరీ టీడీపీ నేరగాళ్లను ప్రోత్సహించాడు. స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం లేకుండా చేసి, చట్టాన్ని పరిటాల వారికి చుట్టాన్ని చేసింది సుధాకర్. ఈ జిల్లాల్లో జరుగుతున్న దుర్మార్గాలను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకుపోవాలన్నదే మా ఉద్దేశం. న్యాయ వ్యవస్థ దృష్టిని కూడా ఈ అంశాలపై పడేలా చేసి, ఇలాంటి హత్యలు మళ్లీ జరగకుండా చేయడమే మా లక్ష్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నమే మాది.

వరుదు కళ్యాణి 
వైఎస్ జగన్‌ను తిట్టడానికే అనితకు హోం మంత్రి పదవి ఇచ్చారు. జగన్‌పై విమర్శలు చేయడానికి సమయం ఉంటుంది. కామాంధులు చేతిలో బలైన బాధితులను పరామర్శించేందుకు సమయం ఉండదు. సొంతం నియోజకవర్గంలో మహిళపై దాడులు జరిగితే హోం మంత్రి అరికట్టలేకపోయారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటే అనితకు ఉలుకెందుకు? జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. క్రిమినల్ అని ఎన్టీఆర్ ఎవరిని అన్నారో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ఐఏఎస్ అధికారులను పేరు పెట్టి తిట్టిన ఘనత చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది. ఐపీఎస్ అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర టీడీపీ నేతలది. దళిత ఐఏఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. ఎమ్మెల్యే ఆదిమూలం, కిరణ్ రాయల్ మహిళలను వేధిస్తే మీరు ఏం చర్యలు తీసుకున్నారు?

ఉమ్మడి అనంత పోలీస్ అసోసియేషన్: వైఎస్ జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దీనిపై న్యాయ పరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఎంతో కష్టపడి, ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటేనే మాకు యూనిఫామ్ వచ్చింది. అలాంటి ఖాకీ దుస్తులు ఊడదీస్తానంటూ జగన్ పదేపదే మాట్లాడుతున్నారు. ఇదే ఉమ్మడి జిల్లాలో ఫ్యాక్షన్, నక్సలిజాన్ని రూపుమాపేందుకు పోలీసు వ్యవస్థ ఎంతో పని చేసింది. ఎంతో మంది ప్రాణాలు కూడా అర్పించారు. నిన్న మీ పర్యటన కూడా రెండ్రోజులపాటు ఎంతో శ్రమిస్తేనే విజయవంతమైంది. కానీ జగన్ పోలీసు వ్యవస్థను కించపరుస్తున్నారు. మాజీ సీఎం కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే.

జనకుల శ్రీనివాస్ (పోలీసు సంఘం నాయకులు) 
మాజీ సీఎంగా ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇవన్నీ కేవలం రాజకీయ మైలేజీ కొరకు జగన్ ఊగిపోతున్నట్టు అనిపిస్తోంది. పోలీస్ డ్రెస్ ఒక ఉక్కు కవచం లాంటిది, రాజ్యాంగ హక్కును కాపాడేది. పోలీసు ఉద్యోగం చేయడం సామాన్య విషయం కాదు. మీరే ఇలా మాట్లాడుతుంటే శాంతి భద్రతలు ఎక్కడ్నుంచి వస్తాయి? తీవ్ర ఒత్తిడికి గురై వారానికి ఒక పోలీసు మరణిస్తున్నారు. పోలీస్ బట్టలు ఉడదీసి ఏం చూద్దామని? పోలీసులకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. కచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. శాంతిభద్రతల వైఫల్యం అనే విమర్శలు అర్ధరహితం. మమ్మల్ని గౌరవించకపోయినా పర్లేదు.. కించపరిచి మాట్లాడకండి.

భవాని (పోలీసు సంఘం నాయకులు) 
పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. బట్టలు ఉడదిస్తానని అనడం కరెక్ట్ కాదు. 5 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు. జగన్ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నాం.

గడికోట శ్రీకాంత్ రెడ్డి 
అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. జగన్ ప్రజల్లోకి వెళ్లిన సమయంలో భద్రతాలోపం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌ను లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తిగా కూడా జగన్‌ను గుర్తించడం లేదు. జగన్‌కు భద్రత కల్పించలేకపోతే, చెప్పండి. ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని తగ్గించేశారు. జగన్ భద్రతపై కేంద్రహోం శాఖకు రిప్రజెంటేషన్ ఇస్తాం. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మండలానికి ఒకరిని చంపితే కానీ భయం రాదు అనేలా భయోత్పాతం సృష్టిస్తున్నారు. చట్టానికి లోబడి పోలీసులకు సెల్యూట్ చేస్తాం. చట్టాన్ని మీరి అన్యాయాన్ని ప్రోత్సహించే వారికి కచ్చితంగా యూనిఫాం లేకుండా చేస్తాం. తప్పుచేయకపోతే భుజాలు తడుముకోవడం దేనికి? హోంమంత్రి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం సరికాదు. చంద్రబాబును క్రిమినల్ అని మాట్లాడటం మాకు పెద్ద విషయం కాదు కానీ మాకు విజ్ఞత ఉంది.

లావు శ్రీకృష్ణ దేవరాయలు
రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్న జగన్ రెడ్డి అరాచకాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాను. పర్యటనల పేరుతో జగన్ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. పాపిరెడ్డిపల్లిలో జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అప్రజాస్వామికం. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై విషం కక్కుతూ పోలీసుల నైతికతను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. 13 ఏళ్లుగా సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌పై తిరుగుతున్న జగన్, వ్యవస్థలను బెదిరించేలా వ్యవరిహస్తున్నారు. నిజాయితీగా పని చేస్తున్న పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు బెయిల్ షరతుల ఉల్లంఘించటమే.

సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి, ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్న నీచుడు జగన్ రెడ్డి. కోడి కత్తి నుంచి రాళ్ల దాడి వరకూ ప్రతిదీ ఒక నాటకం. కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు రేపేలా జగన్ ప్రసంగాలు చేయడం, కార్యకర్తల్ని రెచ్చగొట్టడం ఇవన్నీ శాంతి భద్రతలకు ముప్పు కలిగించే కుట్రలు. ముందుగానే రోడ్డు ప్రయాణం ప్లాన్ చేసి స్క్రిప్ట్ ప్రకారం డ్రామాకి తెర లేపి అలజడులు సృష్టించడానికి నక్కజిత్తుల కుట్రలు జగన్ ముఠా ప్రయత్నిస్తోంది. ప్రజలు ఆదరించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి హానికరంగా మారింది.

పల్లె రఘునాథ రెడ్డి 
అనంతపురం పర్యటనలో జగన్ వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదం. సొంత చెల్లెలు, తల్లికి న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఏమి న్యాయం చేస్తారో చెప్పాలి. హెలిక్యాప్టర్ మొరాయింపు అని జగన్ పెద్ద డ్రామా ఆడాడు. జనాన్ని తరలించి బాధలో ఉన్న కుటుంబ పరామర్శకు రోడ్డు షో చేయడం నీకు తగునా? రూ.5.50 కోట్లు ఖర్చు పెట్టి పాపిరెడ్డిపల్లి పర్యటనా? లింగమయ్య కుటుంబానికి నయా పైసా ఇవ్వకుండా చిన్న గ్రామంలో రాజకీయ రంగు పులిమావు. ఇదేనా నీవు చేసిన న్యాయం. ఫ్యాక్షన్ లేని జిల్లాల్లో మళ్ళీ విధ్వంసం సృష్టించాలన్నదే జగన్ ఉద్దేశ్యం. సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బ తీసేలా కించపరిచే విధంగా జగన్ మాట్లాడటం మంచిది కాదు. బేషరతుగా జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలి.

కారుమూరు వెంకటరెడ్డి 
టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్న 70 మంది పోలీసు అధికారుల్ని ఇప్పటికే గుర్తించాం. రామగిరి ఎస్‌ఐ సుధాకర్ ఇటీవల ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించాడు. టీడీపీ నేతలతో పర్సనల్‌గా ఫొటోలు కూడా దిగాడు. పసుపు చొక్కా వేసుకుని టీడీపీ తొత్తుగా పనిచేస్తూ నిజాయతీ గురించి నువ్వు మాట్లాడతావా సుధాకర్?.

 

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?