Telangana: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఏపీ జితేందర్ రెడ్డి ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పిన జితేందర్ రెడ్డి.. తనను నమ్మి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించారని, కేబినెట్ ర్యాంక్ ఇచ్చారని వివరించారు. ఇక నుంచి తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఏపీ జితేందర్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘురామి రెడ్డి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సహా పలువురు హాజరయ్యారు.
ఎన్నో పోరాటాలు చేసి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని, విభజన చట్టంలో పెట్టిన ఎన్నో అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని జితేందర్ రెడ్డి తెలిపారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కృష్ణా నుంచి రావలసిన నీటి వాటా కూడా ఇంకా రాలేదని గుర్తు చేశారు. సాగు, తాగు నీటి సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తానని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కూడా కేంద్రం చాలా అంశాలను పెండింగ్‌లోనే పెట్టిందని మండిపడ్డారు. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలపై ఒత్తిడి తెస్తామని, పెండింగ్ సమస్యలు పరిష్కారమయ్యేలా పని చేస్తామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానని చెప్పారు. తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామని, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం కసరత్తు మొదలైందని, త్వరలోనే నిర్మాణం జరుగుతుందని వివరించారు.