Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికల్లో అద్భుతంగా ఫలితాలు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంగా ఉన్న ఇండియా కూటమికి ఓవరాల్‌గా మెజార్టీ దక్కలేదు. దీంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఘట్టానికి ఒక రోజు ముందు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ బాంబు పేల్చారు. కొన్ని ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేకపోవచ్చు.. కొన్ని 15 రోజులు మరికొన్ని ప్రభుత్వాలు ఒక్క రోజే అధికారంలో ఉండొచ్చు అని కామెంట్ చేశారు.
‘400 సీట్లు గెలుస్తామని గొప్పలు పోయినవారు సొంతంగా కనీస మెజార్టీని కూడా సాధించుకోలేకపోయారు. ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయనందున.. అసలు ఏమీ జరగదని అనుకోరాదు. మేం ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే చాలా విషయాలు మారిపోతున్నాయి. మొత్తంగా ఇది ఒక కొత్త ఇండియా ప్రభుత్వమే. కొన్నాళ్లు ఆ సర్కారు ఉండనివ్వండి. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక్క రోజే నిలుస్తాయి. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఏమో ఈ ప్రభుత్వం 15 రోజులు మాత్రమే కొనసాగుతుందేమో?’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2014, 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల తరహాలో ఈ సారి బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించుకోలేకపోయింది. ఈ సారి 240 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. ఎన్డీయే మిత్రపక్షాలతో కష్టంగా మెజార్టీ మార్క్‌ను దాటగలిగింది. ఇక కాంగ్రెస్ కూటమి మెజార్టీకి ఆమడదూరంలో ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్‌కు సుమారు నలభై స్థానాలు తక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఏమైనా జరగొచ్చని, కాంగ్రెస్ కూటమి అవకాశం లభిస్తే అధికారాన్ని అందుకోవచ్చని చెబుతున్నారు.