– మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్
– ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు
– ఈసారి అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
– సోనియా గాంధీని ఆహ్వానించనున్న ప్రభుత్వం
Another key decision of Revanth Govt : ఓవైపు సంక్షేమ మంత్రం. ఇంకోవైపు పాలనలో దూకుడు. మరోవైపు ప్రభుత్వంలో మార్పులు. ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరు ఇదే. ఈమధ్యే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గీతాన్ని మార్పులు చేసి అధికారికంగా విడుదల చేశారు.
అలాగే, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో విమర్శలకు చెక్ పడినట్టయింది.
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. సచివాలయం లోపల అన్ని కార్యాలయాలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ ఉత్సవాలకు సోనియా గాంధీని పిలవాలని అనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో విగ్రహం ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుపుతామని వివరించారు.