– రేవంత్ సర్కారు మరో నిర్ణయం
– రెండేళ్లలో 150 భోజన క్యాంటిన్లు
– కలెక్టరేట్లు, బస్టాండ్లు, మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు
– బెంగాల్, కేరళలోని క్యాంటిన్లను పరిశీలించిన కమిటీ
– మహిళా సంఘాలకే నిర్వహణా బాధ్యతలు
– ‘మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసుగా పేరు
– త్వరలో రానున్న విధివిధానాల ప్రకటన
Anna Canteens: పట్టణ, నగర ప్రాంతాల్లోని పేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో మరో కొత్త ఆలోచనతో ముందుకు రానుంది. గతంలో కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు నడిపిన అన్న క్యాంటిన్ల మాదిరిగా ఇక్కడ కూడా చౌకగా, మంచి భోజనాన్ని ప్రభుత్వం తరపున అందించాలని నిర్ణయించింది. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించాలని, వీటికి ‘మహిళా శక్తి క్యాంటిన్ సర్వీస్’గా ప్రాథమికంగా నిర్ణయంచినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు, నిర్వహణలో సమస్యలు వంటి అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఇప్పటికే తెలంగాణ అధికారులు కేరళ, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించగా, గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాబోయే రెండేళ్లలో తెలంగాణలో 150 క్యాంటిన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్లు, విద్యా సంస్థలుండే ప్రదేశాలు, కలెక్టరేట్లు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. క్యాంటీన్ల నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ ఇస్తామని, మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్యాంటీన్‌ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సిందిగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.
సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమీషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్ హనుమంత రావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు, తదితరులు హాజరయ్యారు.