Ambati Rambabu: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పట్టపగలే పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.! ఎందుకోగానీ ప్రతిసారీ పోలీసులు వర్సెస్ అంబటిగా (Police Vs Ambati) పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడానికి.. ఆయన ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టారంటే చాలు పోలీసులతో గొడవలు ఆటోమాటిక్‌గా జరిగిపోతున్నాయి. ఇవన్నీ యాదృచ్చికంగా జరుగుతున్నాయో.. లేదంటే వార్తల్లో నిలవడానికో.. లేకుంటే అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కంట పదే పదే పడటానికి ఇలా స్వతహాగా చేసుకుంటున్నారో కానీ రచ్చ మాత్రం మామూలుగా ఉండట్లేదు. ఈ హడావుడితో అధినేత కంటే ఎక్కువగానే దినపత్రికలు, టీవీ ఛానెళ్లలో తరుచుగా రాంబాబు కనిపిస్తున్నారు. ఆయన చర్యలతో సొంత పార్టీ పెద్దలే విసుగెత్తిపోయి.. ‘ఏందబ్బా అస్తమానూ ఈ గోల’ అని మాట్లాడుకుంటున్నారట. ఈ వయసులో ఇలాంటివన్నీ అవసరమా? ఈయనేమైనా తోపు, తురుం అనుకుంటున్నారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు.. టీడీపీ శ్రేణులు మాత్రం జైల్లో ఊచలెక్కట్టడానికే ఇంతగా తహతహలాడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also- Narayana Murthy: రాజ్యసభకు పీపుల్స్‌స్టార్ నారాయణ మూర్తి.. ఏ పార్టీ తరఫునంటే?
Read Also- PM Modi: ఆమెను మళ్లీ కలిసిన మోదీ.. ఫొటో తెగ వైరల్
ఇవాళ ఇలా..!
వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు (YS Jagan Palnadu Tour) వెళ్తుండగా పోలీసులు-రాంబాబు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఏకంగా ఒకరిపై చేయి చేసుకున్నంత పరిస్థితి. ఓ వ్యక్తి అయితే ఏకంగా అంబటిని పక్కకు తోసేశారు.. ఆయన మఫ్టీలో పోలీసో లేకుంటే టీడీపీ కార్యకర్తో తెలియట్లేదు కానీ, పదే పదే రాంబాబును తోసేశారు. దీంతో ‘ నన్నే టచ్ చేస్తావా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన అంబటి.. అతడిపైకి ఒంటికాలిమీద వెళ్లారు. అయితే మధ్యలో బారీకేడ్లు ఉండటంతో వీలుకాలేదు. వాటిని తోసేసి అతనిపై వెళ్లడానికి ట్రై చేశారు కానీ.. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి మాజీ మంత్రిని అడ్డుకున్నారు. అక్కడికీ వారితోనూ ఆయన వాగ్వాదానికి దిగారు. అయితే చివరాకరికి జగన్ పర్యటనకు రాంబాబును అనుమతించారో లేదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే రాంబాబు.. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, కీలక నేత.. వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తుడు. ఒకవేళ పర్యటనకు వచ్చి ఉంటే.. జగన్ పక్కనే కనిపించే వారు. కనిపించకపోవడంతో పోలీసులతో రచ్చ తర్వాత వెనుదిరిగారనే అర్థం చేసుకోవాల్సి వస్తోంది. ఇలా ఒకటి కాదు రెండు గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. బారికేడ్లు తొలగింపుపై నరసారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తాట తీస్తామని.. పిచ్చివేషాలు వేస్తే అరెస్ట్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంబటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏం చేస్తావ్.. ఏం కథ!
‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలో భాగంగా రాంబాబు తన అనుచరులతో కలిసి గుంటూరులోని సిద్ధార్థనగర్‌లోని తన నివాసం నుంచి కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా బయల్దేరారు. అయితే, ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అంబటి- పోలీసుల మధ్య.. ముఖ్యంగా గుంటూరులోని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అనేక చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలను, వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటు పోలీసులు.. ఇటు రాంబాబు దురుసుగా మాట్లాడుకుని రచ్చకెక్కారు. ‘ఏం చేస్తావ్?.. ఎలా పోనివ్వరో చూస్తా’నంటూ దూకుడుగా అంబటి మాట్లాడారు. అక్కడికీ పోలీసులు వినకపోవడంతో కార్యకర్తలతో కలిసి బారికేడ్లను నెట్టేశారు. ఇందుకు గట్టిగానే రియాక్ట్ అయిన సీఐ వెంకటేశ్వర్లు.. అంబటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు.. నువ్వు పళ్లు కొరుకుతున్నావ్’ అంటూ వేలు చూపిస్తూ అంబటితో ఏకవచనంతో మాట్లాడారు. ఇది అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియా.. సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అయ్యింది. దీంతో రాంబాబుపై పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. సాధారణంగా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా లేదా వారిపై దూకుడుగా ప్రవర్తించినా ఇలాంటి కేసులు నమోదవుతాయి. ఒకదాని తర్వాత మరొకటి ఇలా పోలీసులపైనే జరుగుతుండటంతో తర్వాతి వంతు రాంబాబుదేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో అంబటి అరెస్ట్ ఉంటుందా? లేదంటే లైట్ తీసుకుంటారా అనేది చూడాలి మరి.
Read Also- YS Jagan: అల్లు అర్జున్ లాగే వైఎస్ జగన్‌ను కూడా అరెస్ట్ చేస్తారా?