T.congress got 8 seats
Politics

AICC: రేపే.. ఏఐసీసీ భేటీ

– లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్ష
– ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో జరగనున్న సమావేశం
– హాజరు కానున్న సోనియా, రాహుల్, ప్రియాంక
– ఫలితాల సరళి, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
– విపక్ష నేతగా రాహుల్ గాంధీ?
– కీలక నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి

Congress: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. జూన్ 8న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సాధించిన ఫలితాలు, ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీ పనితీరు వంటి కీలక అంశాలతో బాటు రాబోయే రోజుల్లో పార్లమెంటులో కాంగ్రెస్ అనుసరించాల్సిన వైఖరి మీదా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సీడబ్ల్యూసీ తొలిసారి సమావేశం కానుండటంతో ఆసక్తి నెలకొంది.

18వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మెరుగైన ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతగా 99 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో సొంతంగా 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుంది. గతంతో పోలిస్తే 47 సీట్లు ఎక్కువ సాధించటమే గాక, ఇండియా కూటమి మొత్తంగా 234 స్థానాలను కైవశం చేసుకుని అందరినీ ఆశ్చర్య పరచింది. ఇప్పటికే ఇండియా కూటమి నేతలంతా సమావేశమై రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో పార్లమెంటులో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించిన నేపథ్యంలో విపక్ష నేతగా ఎవరు ఉండాలనే అంశం కూడా చర్చకు రానున్నట్లు సమాచారం. అయితే, ఈసారి లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ అయితే బాగుంటుందనే డిమాండ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీయే విపక్ష నేతగా ఉండనున్నారని గురువారం ప్రకటించారు. రాహుల్ కంటే ప్రజా సమస్యలపై గళమెత్తగలవారు ఇంకెవరని ఆయన అభిప్రాయ పడ్డారు. అటు పార్టీలోనూ రాహుల్ గాంధీ విపక్ష నేతగా ఉంటే బాగుంటే అభిప్రాయం బలపడుతోంది. ఈ క్రమంలో రేపటి ఏఐసీసీ సమావేశంలో ఈ అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలను కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో 2019లో వచ్చిన మూడు సీట్లకు అదనంగా మరో 5 సీట్లను కాంగ్రెస్ సాధించింది. మరో 3 స్థానాలను తక్కువ మెజారిటీలో కోల్పోయింది. ఓట్ల శాతం పరంగానూ గత లోక్‌సభ ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను టీపీసీసీ సాధించింది. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం, తెలంగాణలోనే గాక జాతీయస్థాయిలో చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ తెలంగాణలోనే గాక కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇక, ఇండియా కూటమి గణనీయంగా పుంజుకున్న ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాలతో బాటు పార్టీ అధికారంలో ఉండీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అందుకు కారణమైన అంశాలను రేపటి ఏఐసీసీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో తీసుకోవలసిన నిర్ణయాలు, దృష్టి సారించిన స్థానిక సమస్యల మీదా ఏఐసీసీ ప్రతినిధులు చర్చించనున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?