– పాత్రికేయుల్లో భరోసా నింపిన సీఎం భరోసా
– అర్హులైన అందరికీ త్వరలో అక్రిడేషన్లు
– ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి
Press Academy Chairman: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తోందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర మహాసభలకు వెళుతున్న సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇల్లు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం పాత్రికేయుల్లో ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి శాసనసభ వ్యవహారాలు, ఓటు ఆన్ అకౌంట్, తదుపరి లోక్ సభ ఎన్నికల కారణంగా మీడియా సమస్యలపై నిర్ణయం తీసుకోవటం ఆలస్యమైందని, అయితే.. పాత్రికేయుల సమస్యలపై తాను ఇప్పటికే రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించడం జరిగిందన్నారు.
ప్రెస్ అకాడమీ, సమాచార శాఖ కలిసి జర్నలిస్టుల సంక్షేమ కోసం విధి, విధానాలు రూపొందిస్తే వెంటనే సంతకం చేసి అమలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం శుభపరిణామమని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 24 వేల మందికి అక్రిడిటేషన్లు ఉన్నాయన్నారు. అనర్హులు అక్రిడిటేషన్ పొందడం వల్ల జర్నలిజం వృత్తి మసక బారుతోందనీ, ఈ నెలతో ముగుస్తున్న అక్రిడిటేషన్ల గడువును మరో మూడు నెలలు పెంచి ఈ లోపుగా కొత్త అక్రిడిటేషన్ల విషయంలో మిస్ యూజ్ కాకుండా కసరత్తు ప్రారంభిస్తామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అలాగే, అనర్హులకు అక్రిడిటేషన్లు అందకుండా ప్రెస్ అకాడమీ ఒక విధానాన్ని తీసుకురానుందని, తద్వారా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందించగలుగుతామన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కొందరు జర్నలిస్టులు బ్లాక్ మెయిల్ చేయటం వల్ల ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని, ఇలాంటివాటిపై కఠినచర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.