– అత్యాధునిక హంగులతో 65 ఐటీఐల అప్‌గ్రేడ్
– టాటా కంపెనీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం
– మల్లేపల్లిలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన
– సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరు
– 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దుతామన్న సీఎం
CM Revanth Reddy: తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయని, వాటిలో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు. 40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారన్నారు. ఏటీసీ సెంటర్స్ తర ఆలోచనల నుంచి వచ్చినవేనన్న సీఎం, తాము సేవకులమని తెలిపారు. 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారని, సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం కూడా ఉండాలని చెప్పారు. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని తాను నమ్ముతానన్నారు.
కేవలం సర్టిఫికెట్స్ జీవన ప్రమాణాలను పెంచవని, దుబాయ్ లాంటి దేశాలకు వలస వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారెంటీ ఇస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం రూ.2,324 కోట్లతో 65 ఐటీఐల రూపురేఖలు మారుస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఐటీ రంగంలో ప్రపంచంతో మన తెలుగు వారు పోటీ పడుతున్నారని, మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే తమ బాధ్యతగా చెప్పారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తామని, ఈ శాఖ తన దగ్గరే ఉంటుందని, ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు. మల్లేపల్లి ఐటీఐలో గొప్ప విప్లవాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలకు ఆదరణ లేకుండా పోయిందని తెలిపారు. ప్రతి 65 ఐటీఐ కాలేజీల్లో వీఆర్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా కంపెనీతో పదేళ్లకు ఒప్పందం చేసుకుంది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా ఏటీసీల్లో యువతకు శిక్షణ ఇస్తారు. నిరుద్యోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
