- ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ
- రాహుల్ లా ప్రవర్తించకండంటూ ఎంపీలకు సూచన
- అధికార, మిత్ర పక్షాల నేతలకు దిశానిర్దేశం
- మీడియా కామెంట్స్ కు ముందు ఆ సమస్యపై స్టడీ చేయాలని సూచన
- పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతల తీరు అభ్యంతరకరం
- మ్యూజియంలో ప్రధానుల చరిత్ర అందరూ తెలుసుకోవాలి
- ప్రధాని కుర్చీని కొన్ని దశాబ్దాల పాటు ఒకటే కుటుంబం పాలించింది
Modi coments on Rahul Gandhi at NDA Parliamentary party meeting :
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ నియమావళి ప్రకారం ఎలా సభలో ప్రవర్తించాలన్న విషయాన్ని ఆయన ఎంపీలకు సూచించారు. ఉత్తమ విధానాలు పాటించేందుకు సీనియర్ల నుంచి నేర్చుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా అర్థరహితమైన ప్రసంగాన్ని చేసినట్లు ఆరోపించారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడుతూ.. వరుసగా మూడోసారి కాంగ్రేసేతర పార్టీకి చెందిన నేత ప్రధాని కావడాన్ని విపక్షాలు సహించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం వ్యవహరిస్తున్న తీరును మోదీ ఖండించారు. ఈసందర్భంగా అధికార పక్ష ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పార్లమెంటరీ సమస్యలపై స్టడీ చేయాలని ప్రధాని సూచించినట్లు చెప్పారు.
నియోజకవర్గాల సమస్యలు ప్రస్థావించాలి
తమ నియోజకవర్గానికి చెందిన అంశాలను పార్లమెంట్‌లో రెగ్యులర్‌గా ప్రస్తావించాలన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ మోదీ ఇస్తారని, ఆ సందేశం ప్రతి ఒక్కర్నీ ఉద్దేశించి ఉంటుందని మంత్రి రిజిజు తెలిపారు. ఎన్డీఏ కూటమి మీటింగ్‌లో మోదీని సన్మానించినట్లు రిజిజు చెప్పారు. మూడవసారి చరిత్రాత్మక విజయం సాధించినట్లు తెలిపారు. మీడియాలో కామెంట్ చేయడానికి ముందు ఆ సమస్య గురించి స్టడీ చేయాలని మోదీ సూచించినట్లు రిజిజు చెప్పారు. ప్రధాని మ్యూజియంను కూడా ఎంపీలు అందరూ సందర్శించాలని, అందరి ప్రధానుల జీవిత చరిత్రలకు చెందిన డాక్యుమెంట్లు ఉంటాయని, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని మోదీ చెప్పారని రిజిజు తెలిపారు. ‘‘నిన్న పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్ స్థానాన్ని ఆయన అవమానించారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది. పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’’ అని ప్రధాని ఎంపీల కు సూచించినట్లు రిజిజు తెలిపారు. మంచి ఎంపీగా ఎదగడానికి అవసరమైన పార్లమెంట్ నియమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రవర్తనను అనుసరించాలని ఎన్డీఏ ఎంపీలను ప్రధాని మోదీ కోరారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రధాని మార్గ నిర్దేశనం ఎంపీలందరికీ, ప్రత్యేకించి తొలిసారి సభకు వచ్చిన సభ్యులకు ఒక మంచి మంత్రంగా తాము భావిస్తున్నామని చెప్పారు. ప్రధాని హితోబోధ చేసిన మంత్రాన్ని తాము అనుసరించాలని నిర్ణయంచుకున్నామని వెల్లడించారు. ‘సీనియర్ ఎంపీల నుంచి పార్లమెంటరీ నియమాలు ప్రవర్తనను నేర్చుకోవాలని నూతన ఎంపీలకు మోదీ సూచించారు.
రాహుల్ వ్యాఖ్యలు తొలగింపు
ఎంపీలు తాము మాట్లాడాలనుకున్న అంశంపై ముందుగానే అధ్యయనం చేయాలని మోదీ తెలిపారు. మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండాలని, దేశ సేవకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచనలు చేశారు. రాహుల్ ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించామన్నారు.