– చేరికలపై మంత్రి కోమటిరెడ్డి కామెంట్
– నల్గొండను కేసీఆర్ నాశనం చేశారన్న మంత్రి
– దేవుళ్లనీ దోచుకున్నారంటూ మండిపాటు
– సీటిస్తామన్నా ఎందుకు పోతున్నారని నిలదీత
– ఫోన్ ట్యాపింగ్‌తో తెలంగాణను బద్నాం చేశారని విమర్శ
– త్వరలో బీఆర్ఎస్ ఖాళీ ఖాయమన్న మంత్రి
– మీడియా చిట్‌చాట్‌లో కామెంట్స్
Minister Komatireddy Venkat Reddy Sensational Comments : కాంగ్రెస్ పార్టీ గేట్లు తీస్తే బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలో చేరుతున్నారనే మాటలో వాస్తవం లేదనీ, కేసీఆర్ నియంతృత్వ ధోరణిని భరించలేక, విసిగిపోయిన నేతలు కాంగ్రెస్ పార్టీ గేట్లు బద్దలు కొట్టుకుని మరీ తమ పార్టీలో చేరుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక వర్తమాన రాజకీయ అంశాల మీద ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి దుస్థితికి ఆయన స్వయంకృతాపరాధాలే కారణమని, ఆయన పాలనా కాలంలో ఆయన తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలే ఆయన పాలిట శాపాలుగా మారుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అనాదిగా ఉన్న యాదగిరి గుట్ట అనే పేరును మార్చటం సీఎంగా కేసీఆర్ చేసిన మొట్టమొదటి తప్పు అనీ, ఆలయ పునర్మిర్మాణం పేరుతో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విచారణ జరిపించటమే గాక యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు.
గతంలో ‘కాంగ్రెస్ పాలన అంటే వర్షం.. వర్షం అంటే కాంగ్రెస్ పాలన’ అన్నట్లుగా ప్రజలు భావించేవారనీ, రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే ఆలేరు ప్రాజెక్ట్ పూర్తయ్యేదనీ, కానీ కేసీఆర్ ఆ ప్రాజెక్టును అటకెక్కించటంతో పొలాలు ఎండిపోతున్నాయని, ఆ పొలాలు చూస్తుంటే ఏడుపు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాళేశ్వరం’ అంటూ దేవుడి పేరు పెట్టి మరీ జనం సొమ్మును దోచుకుతిన్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాను ఇంత నాశనం చేసిన కేసీఆర్ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వస్తారంటూ నిలదీశారు.తన హయంలో కేసీఆర్ కొందరు అధికారుల మెడమీద కత్తిపెట్టి తప్పుడు పనులు చేయించారని, ఆయన నైజం తెలియక అందులో ఇరుక్కున్న నాటి అధికారులు, వారి కుటుంబాలకు నేడు కంటిమీద కునుకు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫామ్‌హౌస్‌కు రోడ్డు వేయించేందుకు ఏనాటి నుంచి అక్కడ కాపురముంటున్న వారి ఇళ్లను బలవంతంగా కూలదోయించి పాపం మూటగట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో దళితబంధు, సీఎంఆర్ఎఫ్ ఇలా ప్రతి పథకంలోనూ నేతలు కమిషన్లు దండుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇచ్చామని, పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలని సవాలు విసిరారు.
Read Also: కూతుళ్లతో కలిసి కాంగ్రెస్‌లోకి..
దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడటం లేదనీ, కేసీఆర్ ప్రభుత్వం ఆ తప్పుడుపని చేసి తెలంగాణ పేరును పాడు చేసిందన్నారు. ప్రతి దానిలోనూ రాజకీయం చేయటం అలవాటైన కారణంగానే కేసీఆర్ మంచీచెడూ అని చూడకుండా ప్రతి దానినీ కేసీఆర్ రాజకీయం చేశారని.. తాను చేసిన పాపాల పుట్టలు నేడు బద్దలవుతుంటే.. మైండ్ బ్లాంక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే లోక్‌సభ సీటు తీసుకున్న అభ్యర్థులు సైతం ‘మాకొద్దు బాబోయ్’ అంటూ పారిపోతున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పార్టీ నేతల కోసం గేట్లు తెరవలేదని.. అక్కడి ఉక్కపోతను తట్టుకోలేక తమ పార్టీ గేట్లు పగలకొట్టి మరీ వచ్చి చేరుతున్నారని, మరికొన్ని రోజుల్లో గులాబీ పార్టీలో ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నవారికి పార్టీ అధిష్ఠానం టికెట్ ఇస్తున్నమాట నిజమేనని, కానీ, దానివల్ల పాత నేతలకు నష్టం జరగదని, వారిని అన్నివిధాలా పార్టీ గౌరవిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ స్థానంలో గెలుపు గుర్రాన్ని బరిలో దించబోతున్నామని ఆయన ప్రకటించారు.