– కాంగ్రెస్‌లోకి కేకే, కడియం
– పోటీనుంచి తప్పుకున్న కడియం కుమార్తె కావ్య
– తండ్రి బాటలోనే మేయర్ విజయలక్ష్మి
– కావ్యకు వరంగల్ సీటు దక్కే అవకాశం?
– కేకేతో బాటలో మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యేలు
– వరుస ఘటనలతో ఉక్కపోతలో గులాబీ దళం
– ఒక్క సీటూ కష్టమేనంటున్న పార్టీ శ్రేణులు
BRS leaders Join Congress For Sake Of Daughters: లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ అంశాలతో కుదేలైపోతున్న బీఆర్ఎస్ పార్టీకి రోజుకో కొత్త రకం షాక్ తగులుతోంది. ఇప్పటికే కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోగా, పదేళ్లు పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలూ అక్కడ ఇమడలేక గుడ్ బై చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల వేళ సీనియర్ నేతలంతా గులాబీ పార్టీని వీడటం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సంచలనలంగా మారుతోంది.
13 ఏళ్ల తర్వాత సొంతగూటికి కేకే
తాజాగా రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు, ఆయన కుమార్తె కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. దీనిపై శుక్రవారం తన నివాసంలో మీడియాతో కేశవరావు మాట్లాడారు. కేసీఆర్ కంటే ముందే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేసిన కొద్దిమందిలో తానూ ఒకడినని, పార్లమెంటులో తనతో బాటు ఎందరో తెలంగాణ వాదులు గట్టిగా పోరాటం చేయటంతో బాటు కాంగ్రెస్ చిత్తశుద్ధి కారణంగానే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని కేశవరావు అన్నారు. 85 ఏళ్ల వయసున్న తన జీవితంలో 55 ఏళ్లు కాంగ్రెస్‌తోనే ముడిపడి ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యుడిగా, నాలుగు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా తాను పనిచేశాననీ, తనకు ఆ పార్టీ ఎంతో గుర్తింపునిచ్చిందని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయటం వల్లనే తాను నాడు ఎంతో బాధతో కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని వివరించారు. నాడు తన కుమారుడు విప్లవ్ కుమార్ కోరిక మేరకు తాను కేసీఆర్‌తో చేయి కలిపానని చెప్పుకొచ్చారు.
Read Also : కేకే.. ఔట్..!
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయానికి కుటుంబ పాలనే ప్రధాన కారణమని కేశవరావు అభిప్రాయపడ్డారు. మోదీ నియంతృత్వ పాలన కారణంగా ఇండియా కూటమిలో చేరాలని తాను కేసీఆర్‌కు సూచించినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పిన మాటనూ తానూ విశ్వసించానని, కానీ ఆయన మాట తప్పారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసమే తాను ఇంతకాలం కేసీఆర్ వెంట నిలిచానన్నారు. 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత తాను తిరిగి సొంత ఇంటికి చేరుకునే సమయం వచ్చిందని, శనివారం తన కుమార్తెతో కలసి కాంగ్రెస్‌లో చేరుతున్నారని కేశవరావు ప్రకటించారు.
తన నిర్ణయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని, అవసరమైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ అధిష్ఠానం కోరితే పోటీ చేస్తానని ప్రకటించారు.
బీఆర్ఎస్‌కు కడియం బైబై
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరి, మల్లు రవి, సంపత్‌కుమార్, రోహిన్‌రెడ్డి తదితరులు కడియం నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించి, కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఏఐసీసీ ఆదేశాలమేరకే పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చినట్టు దీపాదాస్ మున్షి తెలిపారు. కాగా తన సన్నిహితులు, కార్యకర్తలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని కడియం వారితో చెప్పారు.
Read Also : ఓటేసిన సీఎం
దీనికి కొన్ని గంటల ముందు గురువారం కడియం శ్రీహరి కుమార్తె తనకు కేటాయించిన వరంగల్ బీఆర్ఎస్ సీటు వద్దంటూ పార్టీ అధినేత కేసీఆర్‌కి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు వంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ ప్రతిష్ట దిగజారిందని, జిల్లాలోని బీఆర్ఎస్ నేతల సహకారం తమకు కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం కడియం శ్రీహరి కుమార్తె ప్రకటించారు. తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతూనే, తాను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోనని ఆమె లేఖ ద్వారా తెలియజేశారు. ఒకట్రెండు రోజుల్లో వీరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదగా కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఖాయమని, కడియం శ్రీహరి లేదా ఆయన కుమార్తెల్లో ఒకరికి వరంగల్ కాంగ్రెస్ సీటు దక్కే అవకాశముందని భావిస్తున్నారు.