Diabetes: మన భారతదేశంలోని జనాభాలో దాదాపు 11% మంది మధుమేహులేనట. ఇక అమెరికాలో 3.8 కోట్ల మందికి డయాబెటిస్ ఉంది, వీరిలో 90% నుండి 95% వరకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారే. సాధారణంగా, ఇది 45 ఏళ్ల పైబడిన వయోజనుల్లో ఎక్కువగా కనిపించేది. అయితే, ఇప్పుడు పిల్లల్లో కూడా ఈ వ్యాధి కనిపించేస్తోంది. మధుమేహం ప్రధానంగా జీవన శైలికి సంబంధించిన వ్యాధిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు దీని అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. అదనపు చక్కెరలు, సంతృప్త కొవ్వులు, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ ఉప్పు, అధిక కేలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
భారతీయ పరిశోధన ఏం చెప్పింది?
మైక్రోన్యూట్రియంట్లు (విటమిన్లు & ఖనిజ లవణాలు) డయాబెటిస్ మధ్య ఉన్న సంబంధాన్ని భారతదేశానికి చెందిన ప్రముఖ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం 2025 జనవరిలో BMJ Nutrition, Prevention & Health జర్నల్‌లో ప్రచురించబడింది.
పరిశోధన ఎలా జరిగింది?
Diabetes: శాస్త్రవేత్తలు 1998 నుండి 2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైన 132 పరిశోధనలను సమీక్షించారు. ఈ పరిశోధనల్లో మొత్తం 52,501 మంది పాల్గొన్నారు. వీరు వివిధ దేశాలకు చెందిన 18 సంవత్సరాల పైబడిన పురుషులు మరియు మహిళలు. పాల్గొన్న వారిలో కొందరు డయాబెటిస్ ఉన్నవారు, మరికొందరు డయాబెటిస్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు. పరీక్షల్లో విటమిన్లు & మినరల్స్ లోపాలు ఉన్నవారిని గుర్తించారు. ముఖ్యంగా, ఈ లోపాలు రక్త పరీక్షల ద్వారా నిర్ధారించబడ్డాయి.
పరిశోధనలో ఏం తేలింది?
45% పైగా డయాబెటిస్ రోగులకు మైక్రోన్యూట్రియంట్ లోపం ఉంది.
40% డయాబెటిస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు మైక్రోన్యూట్రియంట్ లోపంతో ఉన్నారు.
మహిళలకు పురుషుల కంటే ఎక్కువగా విటమిన్లు, మినరల్స్ లోపం ఉంది.
Vitamin D లోపం (60% పైగా) డయాబెటిస్ ఉన్నవారిలో అత్యధికంగా కనిపించింది.
Magnesium లోపం (42%) రెండవ స్థానంలో ఉంది.
Metformin మందు తీసుకునే రోగుల్లో 29% మందికి Vitamin B12 లోపం ఉన్నట్లు గుర్తించారు.
మైక్రోన్యూట్రియంట్లు – డయాబెటిస్‌కు ముందా, తర్వాతా?
ఈ విషయాన్ని పరిశోధకులు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. డయాబెటిస్ వల్ల మైక్రోన్యూట్రియంట్ లోపం వస్తుందా లేదా ఈ లోపాల వల్ల డయాబెటిస్ వస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ, ఈ రెండింటి మధ్య ఒక సంబంధం ఉందని మాత్రం తేలింది. మీకు డయాబెటిస్ ఉన్నా లేకపోయినా, ఈ విటమిన్లు, మినరల్స్ లోపం మీలోనూ ఉండొచ్చు. Vitamin D, Vitamin B12, Magnesium వంటి పోషకాలు అందరికీ అవసరం.
Vitamin B12 ఏ ఆహారాల్లో లభిస్తుంది?
మాంసం, చేపలు, పాలు, పెరుగు, చీజ్
శాకాహారులకు – ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, సోయా మిల్క్, న్యూట్రిషనల్ ఈస్ట్
Vitamin D కోసం?
సూర్యకాంతి ద్వారా శరీరం స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. లేలేత సూర్యకిరణాలు మీ శరీరానికి ఒక పది నిమిషాల పాటు తగిలినా చాలు. శరీరంలోని అన్ని చక్రాలు సెట్ అవుతాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. కొందరికి అసలు సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించవు. అలాంటి సమయంలో అసలు ఒంటికి ఆ కిరణాలు తాకవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే.. గుడ్డులోని పచ్చ సొన, కాల్షియం ఫోర్టిఫైడ్ పాలు, కాడ్ లివర్ ఆయిల్, చేపలు తీసుకోవచ్చు.
Magnesium ఎక్కువగా లభించే ఆహారాలు?
నట్స్, విత్తనాలు, లెగ్యూమ్స్, పచ్చి ఆకుకూరలు, ఫలాలు, శనగలు. డార్క్ చాక్లెట్‌లో కూడా మాగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.
జీవన శైలిలో చిన్న మార్పులతో మంచి లాభాలు ఉంటాయి. ప్రాసెస్‌డ్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. అసలు తీసుకోవడం మానేస్తే మరీ మంచిది. చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. ప్రతిరోజూ ఒక చిన్న ఆరోగ్యకరమైన మార్పు అలవర్చుకోండి. ఉదాహరణకు, సోడా బదులు నీళ్లు తాగడం, బయట ఆహారం తినడం తగ్గించడం.