Ugadi Festival 2025: రంగురంగుల పూల సోయగాలు కనువిందు చేసేది చెట్ల కొమ్మలకు కొత్త చిగురాకులు తొడిగేది ఫల రాజైన మామిడి చేతికందేది శివునికి సిరిమల్లె విరులు సమర్పించేది శ్రావణామృత భరిత కోకిల గానం వినిపించేది కవుల వర్ణనలకు కొరత తీర్చేది నవ వసంతమే అయితే నేటి నుండి ప్రారంభం అయ్యే ‘విశ్వావసు’ నామ సంవత్సరం అందరికీ సుఖ, సంతోషాలభరితం కావాలని కోరుకుంటూ ఉగాది పండుగకు సంబంధించిన ప్రత్యేక కథనం.
ఆరు రుతువుల్లో అందరినీ మైమరిపించేది వసంత రుతువే. శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం ‘రుతువుల్లో నేను వసంత రుతువు’నని చెప్పాడట. తెలుగు నాట చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది (తెలుగు సంవత్సరాది) సంబురాలు జరుపుకోవడమనేది ఆనవాయితీ. పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన నూతన సంవత్సర ఆరంభంగా భావిస్తున్న ఖగోళ స్థితిగతులను బట్టి సంవత్సర ఆరంభం వసంతకాలంతోనే అనే విషయం గుర్తించాలనేది పెద్దలు చెబుతున్న మాట. ‘ఉగస్య ఆది: ఉగాది’ అంటే యుగం ప్రారంభమైంది ఉగాది నుండే అని అర్థం.
దీనిని ఆధారంగా చేసుకొని తెలుగువారు ఖచ్చితంగా సంవత్సర ఆరంభం ఉగాది గానే భావించి పండుగ జరుపుకోవాలని శాస్త్రం తెలిసిన వారు నొక్కి వక్కానిస్తూ చెబుతున్న మాట. అందుకే సరికొత్త జీవనానికి ఆరంభం ఉగాదిగా చెప్పుకోవచ్చు. రుతు, మాస, పక్షాలకు సంబంధించిన పండుగ ఉగాది.
ఋతువులలో మొదటిది వసంతం, మాసాలలో మొదటిది చైత్రం, పక్షాలలో మొదటిది శుక్లపక్షం. కనుక చైత్ర శుద్ధ శుక్ల రాజ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకోవడం అనేది ఆచారంగా వస్తుంది. అయితే ప్రతి పండుగకు ఏదో ఒక దైవంతో సంబంధం ఉంటుంది. కానీ ఉగాదికి ప్రత్యేకంగా ఏ దేవుని లేక దేవతను పూజించే ఆచారం లేకపోవడంతో ఎవరికి వారు స్వేచ్చగా తమ ఇష్టదైవాలను పూజిస్తుంటారు. అయితే ఉగాది పుట్టు, పూర్వోత్తరాలకు సంబంధించిన పురాణ, ఇతిహాసాల ప్రకారం అనేక కథలు వినిపిస్తున్నాయి.
Also Read: Bank Holidays April 2025: అలర్ట్.. అలర్ట్.. ఏప్రిల్ లో సగం రోజులు.. బ్యాంక్ సెలవులే..
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను దొంగిలించిన సోమకుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి కావడంతో ఉగాది ఆ రోజున జరుపుకుంటారనేది ఓ కథనం. శ్రీరాముడు రావణ సంహారం తరువాత చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైనడనేది మరో కథనం. ధర్మరాజు కూడా ఇదే రోజున పట్టాభిషిక్తుడైనట్లు మహాభారతం చెబుతుంది. గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట (వరాహ మిహిరుడు) ఈరోజే తొలి పంచాంగమును ఆవిష్కరించాడని పెద్దలు చెబుతున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన చైత్ర శుద్ధ పాడ్యమిని సకల శుభాలకు నాంది కలిగించే రోజుగా భావిస్తుంటారు.
సాంప్రదాయాల వెల్లువ:
ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమ, పూలు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించుకోవడమనేది ఆనవాయితీగా వస్తుంది. పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఇష్టదైవాన్ని ప్రతిష్టించి షోడశోపచారాలతో పూజించి దీప, దూప, నైవేద్యాలు కాకుండా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రధానంగా నివేదిస్తుంటారు.
అయితే ఉగాది రోజున అభ్యంగన స్నానమాచరించడం అనేది శుభప్రదం, ఆరోగ్యప్రదం అంటుంటారు. నువ్వుల నూనెలో మహాలక్ష్మి, జలంలో గంగాదేవి కొలువై ఉంటారనేది ఆర్యోక్తి. సాంప్రదాయ దుస్తులను ధరించి ముందుగా ఉగాది పచ్చడి ఆరగించి తదుపరి బంధుమిత్రులతో భోజనం చేయడం అనేది
ఉగాది ప్రత్యేకత.
ఆరోగ్య ప్రదాయిని ఉగాది పచ్చడి: ఆరు రుచులతో చేసేది ఉగాది పచ్చడి. దీనిని దివ్యౌషధమని చెప్పాలి. వేపపువ్వు, చింతపండు గుజ్జు, కొత్త బెల్లం, కొబ్బరి, మామిడి కాయ ముక్కలు, చెరుకు రసం, అరటి పండ్లు, ఉప్పు, కారంలతో తయారు చేసేది ఉగాది పచ్చడి. దీనిలోని వేప పువ్వులో గల చేదు క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతుంది. కప, వాత, పైత్యాలను హరించి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. బెల్లం వల్ల శరీరంలోని వేడిని తగ్గడంతో పాటు జీర్ణ క్రియ పెరుగుతుంది. మామిడికాయ గుండెకు బలాన్ని ఇస్తుంది.
కాలేయానికి మంచిది, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. చెరుకు రసం మూత్రపిండాలకు చాలా మంచిది. అధిక మూత్రాన్ని, వాతాన్ని అరికడుతుంది. ఇన్ని గుణాలు ఉన్న ఉగాది పచ్చడిని ఆరోగ్యప్రదాయనిగా చెప్పుకోవచ్చు.
Also Read: Telangana Govt: ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఏకంగా రూ. 5 లక్షల సాయం