Moles : పుట్టుమచ్చలు మన శరీరం మీద ఉంటాయి. ఈ చిన్న చిన్న గుర్తులు మన శరీరంపై ఒక ప్రత్యేకమైన అందాన్ని తెస్తాయి.అయితే, ఇవి ఎక్కువగా బుగ్గ మీద, పెదవి కింద, మెడపైన ఉండే ఈ చిన్న మచ్చలు మన ముఖానికి ఆకర్షణను తెస్తాయి. కొందరు వీటిని అదృష్టం భావిస్తే మరికొందరు దురదృష్టకరమని బాధ పడుతుంటారు. కానీ, ఈ అందమైన మచ్చల వెనుక పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసా?
పుట్టుమచ్చల వలన చర్మ క్యాన్సర్ వస్తుందా ?
చాలా సందర్భాలలో పుట్టుమచ్చలు మంచివే అయినప్పటికీ, కొన్ని అరుదైన సందర్భాలలో అవి చర్మ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. మన భారతీయ చర్మంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం సమృద్ధిగా ఉండటం వల్ల, ఇతర జాతులతో పోలిస్తే మనకు మెలనోమా వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ మెలనిన్ మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం లాంటిది. అయినా, ప్రమాదం లేదని కాదు. అందుకే, మన శరీరంపై ఉండే పుట్టుమచ్చలలో ఏవైనా మార్పులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి?
మీ శరీరంపై ఏళ్ల తరబడి ఉన్న పుట్టుమచ్చలో హఠాత్తుగా ఏదైనా మార్పు కనిపిస్తే, వెంటనే దాన్ని గమనించండి. ఈ కింది లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.
రంగు మార్పు: మీ శరీరం మీద నున్న పుట్టుమచ్చ ఒకే రంగులో కాకుండా, నలుపు, ఎరుపు లేదా ఇతర రంగుల కలయికగా మారితే.
పరిమాణంలో మార్పు: మచ్చ 6 మిల్లీమీటర్ల కంటే పెద్దదిగా పెరిగితే డేంజర్.
అసౌకర్యం: మచ్చ ఉన్న చోట నొప్పి, దురదగా అనిపిస్తే .. వైద్యున్ని సంప్రదించండి.
రక్తస్రావం : ఎలాంటి గాయం లేకుండానే మచ్చ నుండి రక్తం కారడం లేదా పైన పొక్కు ఏర్పడడంలాంటివి జరిగినప్పుడు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా మీరు డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
